Supreme Court: గ్రూప్-1 పరీక్షకు లైన్ క్లియర్.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ - 1 పరీక్ష వాయిదా వేసే విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు

suprem court
Group 1 Exam 2024: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ – 1 పరీక్ష వాయిదా వేసే విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ గ్రూప్ -1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీర్పు వచ్చే వరకు పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. జీవో 55నే అమలు చేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను వాయిదా వేయలేమని పేర్కొంది. దీంతో గ్రూప్-1 పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి.
మధ్యాహ్నం 2గంటలకే పరీక్ష ప్రారంభం కానుండటంతో ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అభ్యర్థుల హాల్ టికెట్లను నిశితంగా పరీశీలించి పరీక్షా కేంద్రంలోపలికి పంపిస్తున్నారు.
పరీక్షలకోసం పటిష్ట ఏర్పాట్లు ..
ఇవాళ్టి నుంచి 27వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకోసం అధికారులు తెలంగాణ వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు 31,383 మంది హాజరు కానున్నారు. పరీక్ష గది, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించనున్నారు. ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు జరిగే పరీక్షలకు సంబంధించి రోజూ ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు తరలించే జీపీఎస్ అమర్చిన వాహనాలు నిర్దేశిత మార్గాల్లోనే ప్రయాణించేలా రూట్ మ్యాప్ రూపొందించారు.