Nara Lokesh: ముంపు గ్రామాల్లో నారా లేకేష్.. భద్రాద్రి రామునికి పూజలు

పోలవరం ముంపు మండలాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటిస్తున్నారు.

TDP General Secretary Nara Lokesh: పోలవరం ముంపు మండలాల్లోని ఐదు పంచాయతీల సమస్యపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే రెండు నిమిషాల్లో సమస్య పరిష్కారం అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. భద్రాద్రి సీతారామస్వామిని దర్శించుకుని, అనంతరం లోకేశ్ పోలవరం ముంపు మండలాల్లో పర్యటించేందుకు వెళ్లారు.

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ.. ఐదు పంచాయతీల సమస్య.. ఏడేళ్లుగా ఉందన్నారు. దీనిపై రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు. దేశం నుంచి కరోనా మహమ్మారి వదిలిపోవాలని భద్రాద్రి రాముని కోరుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా లోకేష్‌కు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవస్థానం తరపున శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.

భద్రాచలంలో నారా లోకేష్‌కు శాసనసభ్యులు పొదెం వీరయ్య, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో లోకేష్ వెంట శాసనసభ్యులు పొదెం వీరయ్య, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, టీడీపీ నాయకులు బక్కని నర్సింహులు, కొండపల్లి రామచంద్రరావు, కొడాలి శ్రీనివాసన్, కుంచాల రాజారామ్, కోనేరు రాము, ఎస్‌కే అజీమ్, నల్లమల రంజీత్, జ్యోతుల నవీన్, వరపుల రాజా, ఆదిరెడ్డి వాసు తదితరులు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు