మనసులో దేవుడు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు, తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలపై ప్రశంసల వర్షం

కులం, మతం. చాలా సున్నితమైన అంశాలు. ఇందులో ఏ వర్గాన్ని నొప్పించకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. అది ప్రభుత్వాలు అయినా కోర్టులు అయినా ఆచితూచి స్పందిస్తాయి. ఏ మాత్రం అదుపు తప్పినా పరిస్థితిని అదుపు చేయడం చాలా కష్టం. ఇలాంటి వ్యవహారమే ఒకటి తెలంగాణ హైకోర్టుకి ఎదురైంది. అయితే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ఎంతో చాకచక్యంగా, అద్భుతంగా డీల్ చేశారు. ఎవరినీ నొప్పించకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వ్యాఖ్యలు చేశారు. గుడిలోనే దేవుడికి ప్రార్థనలు చేసుకోవాలని ఎక్కడా లేదని, మనసులో దేవుడు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని అద్భుతంగా చెప్పారు. తెలంగాణ సచివాలయంలోని మసీదు కూల్చివేతపై పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ హైకోర్టు మనసులను గెలుచుకునే మాటలు చెప్పింది. అంతేకాదు న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని చాటేలా తెలంగాణ న్యాయమూర్తులు వ్యవహరించడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ సచివాలయంలోని మసీదు కూల్చివేతపై సయ్యద్ యాసన్, మహమ్మద్ ముజాఫరుల్ల, ఖాజా అజ్జాజుదీన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం(సెప్టెంబర్ 9,2020) విచారణ చేపట్టింది.
ఇందులో భాగంగా సచివాలయంలో ఉన్న భూమి వక్ఫ్ బోర్డుకు చెందిన భూమి అని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా మసీదు కూల్చివేత చట్ట విరుద్ధమని వాదించారు. 657 గజాలు ఉన్న మసీదును కూల్చివేసి 1500 చదరపు అడుగులు స్థలం కేటాయించడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ సచివాలయం కూల్చివేతలో భాగంగా మసీదు కూడా కూలిపోయిందన్నారు.
ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుంటూ… గుడిలోనే దేవుడికి ప్రార్థనలు చేసుకోవాలని ఎక్కడా లేదని, మనసులో దేవుడు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని అద్భుతమైన వ్యాఖ్యానం చేసింది. అంతటితో హైకోర్టు ఊరుకోలేదు. దేవుళ్లు, మతాల కంటే చట్టాలు గొప్పవని చెప్పింది. ప్రజావసరాల కోసం మసీదుల్ని కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేయడం ద్వారా న్యాయ వ్యవస్థ గౌరవాన్ని పెంచినట్టు అయ్యింది.
మసీదును కూల్చిన చోటే నూతనంగా మసీదు నిర్మాణం చేపట్టాలని పిటీషనర్లు కోరిన సందర్భంలో కోర్టు ఈ విధమైన కామెంట్స్ చేసింది. అవసరమైతే కూల్చిన ప్రదేశానికి సంబంధించి నష్ట పరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మసీదు కూల్చివేతపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తీర్పులివ్వడంలో తెలంగాణ హైకోర్టు చూపుతున్న విజ్ఞత ప్రతి ఒక్కరి మన్ననలు అందుకుంటోంది.