Telangana AP Weather Today : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
Telangana AP Weather Today : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Telangana AP Weather Today
Telangana AP Weather Today : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. సెప్టెంబర్ 4న తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. తెలంగాణకు ఇవాళ ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులకు సంబంధించి హెచ్చరిక జారీ చేసింది.
తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో గాలిలో తేమశాతం పెరగడంతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లగా మారింది. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో సాయంత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్‌లోనూ సాయంత్రం, రాత్రి వేళ్లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో తీర ప్రాంతాల్లో గాలివేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండొచ్చునని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
