Congress: కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ.. ఏఐసీసీ కార్యాలయం ఎదుట ధర్నా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్నా కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పంచాయతీ ఇంకా తేలలేదు. వలస వచ్చిన ప్యారాచ్యుట్ నేతలకు ఇవ్వొద్దని ఆందోళన రేగుతోంది.

telangana assembly elections 2023 congress tickets lolli and nagam janardhan reddy raise voice

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల లొల్లి కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి చేరుతున్న వారికి టిక్కెట్లు ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలకు దిగుతున్నారు. పారాషూట్ నేతలకు టికెట్లు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ తాజాగా ఇల్లందు నియోజకవర్గ కార్యకర్తలు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. డబ్బు ఉన్నవారికే టికెట్లు ఇస్తున్నారని, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇల్లందు టికెట్ బంజారా కమ్యూనిటీకి ఇవ్వాలని, బంజారా సామాజిక వర్గానికి 8 స్థానాలు కేటాయించాలని కోరారు.

కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు
మరోవైపు ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చిస్తున్నారు. మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, కేసీ వేణుగోపాల్, మురళీధరన్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణిక్ రావు ఠాక్రే, జిగ్నేష్ మేవాని సహా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. విదేశీ పర్యటన కారణంగా రాహుల్ గాంధీ సమావేశానికి హాజరుకాలేకపోయారు. 60 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముందని సమాచారం. సుమారు 10 స్థానాలకు మాత్రం అభ్యర్థుల ఎంపిక మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటున్న కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కొందరు నాయకుల చేరికలు, కొన్ని చోట్ల పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో.. ఆ స్థానాలకు ఇప్పుడే అభ్యర్థుల ప్రకటన ఉండకపోవచ్చని తెలుస్తోంది.

ప్యారాచ్యుట్లకు టికెట్లపై నాగం గరం
ప్యారాచ్యుట్లకు టికెట్ల కేటాయించడం సిగ్గు చేటని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తనలాంటి వారిని విస్మరించడం సరికాదని మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి అన్నారు. తుర్కయాంజల్ అరుణ కన్వెన్షన్ హాల్లో తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. నాగర్ కర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజీ పేట్, తాడూర్, తెల్కపల్లి మండలాలకు చెందిన నాగం మద్దతుదారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నాగర్ కర్నూలు ప్రజాప్రతినిధులు, కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటానని నాగం జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. నాగర్ కర్నూలు కాంగ్రెస్ టికెట్ తనకు కాకుండా వేరే వ్యక్తులకు ప్రకటించడంతో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. కాగా, నాగర్ కర్నూలు టిక్కెట్ దక్కకపోవడంతో నాగం కొద్ది రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: టార్గెట్ రేవంత్ రెడ్డి.. పాలేరుతో పాటు కొడంగల్ నుంచి వైఎస్ షర్మిల పోటీ?

ట్రెండింగ్ వార్తలు