Aleti Maheshwar Reddy : తెలంగాణ బీజేపీకి ‘బూస్టర్ డోస్’.. రైతు పోరాటంతో నేతలను ఏకం చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యూహం!
Aleti Maheshwar Reddy : తెలంగాణలో బీజేపీని ఒక్కతాటిపైకి తెచ్చి ప్రజా సమస్యలపై పోరాటం దిశగా పార్టీ నడిపించడంలో ఏలేటి మహేశ్వర రెడ్డి వ్యూహం ఫలించిందంటున్నారు.
Aleti Maheshwar Reddy
Aleti Maheshwar Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రజా సమస్యలపై, ముఖ్యంగా రైతాంగ సంక్షేమంపై ప్రధాన ప్రతిపక్షంగా నిలబడటంలో ఏ పార్టీ ముందంజలో ఉందంటే.. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పేరే వినిపిస్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్ర బీజేపీ నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చారు. దానికి వేదికగా నిలిచింది – “రైతు గోస – బీజేపీ భరోసా” బస్సు యాత్ర. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, జొన్నల కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర ఆలస్యం, మిల్లుల దగ్గర జరుగుతున్న అక్రమాలు, తరుగు పేరిట క్వింటాలుకు 4 కిలోల కోత విధిస్తూ రైతులను ముంచేస్తున్న వైనాన్ని ప్రశ్నిస్తూ బీజేపీ ఈ బస్సు యాత్రను చేపట్టింది.

అయితే, ఈ కీలకమైన, అల్టిమేట్ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్నది బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తోంది. గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న బీజేపీని, అసలైన ప్రజా సమస్య వైపు మళ్లించి అందరినీ ఏకం చేయడంలో ఆయన వ్యూహం వంద శాతం ఫలించింది. బీజేపీ క్యాడర్ లో ఉత్సాహం వచ్చింది.
గజ్వేల్లో కేసీఆర్ చేయని పని.. రైతుల కోసం వెళ్లిన బీజేపీ నేతలు
ఈ యాత్రలో భాగంగా బీజేపీ బృందం గజ్వేల్ నియోజకవర్గాన్ని సందర్శించడం ఒక హైలైట్. తన సొంత నియోజకవర్గంలో రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నా మాజీ సీఎం కేసీఆర్ కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. కానీ బీజేపీ నేతలంతా కలిసి అక్కడికి వెళ్లడంతో కలెక్టర్ ఒకే రోజు 30 లారీలను తెప్పించి ధాన్యం తరలింపు చేపట్టారు.
రేవంత్ రెడ్డి సర్కార్ను ఢీకొట్టే సత్తా..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం తర్వాత కేంద్ర బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణే. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని సమర్థవంతంగా ఢీకొట్టగల లీడర్ తెలంగాణ బీజేపీకి అవసరం. ఏలేటి మహేశ్వర్ రెడ్డి మొదటి నుంచీ పార్టీ కోసం గట్టిగా నిలబడుతూ, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అంశాలను ముందే గుర్తిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రారభించిన ‘రైతు గోస.. బీజేపీ భరోసా’ యాత్రలో ఆయన.. ప్రభుత్వ అబద్ధపు లెక్కలను తూర్పారబడుతూ, క్షేత్రస్థాయి ఆధారాలతో నిలదీస్తున్న తీరు రైతాంగాన్ని ఆకట్టుకుంటోంది.
యాత్రలో భాగంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ దందా, కమిషన్ల దందాలో మునిగిపోయి, ఈ రోజు రాష్ట్రాన్ని, రైతన్నను గాలికి వదిలేసిన విషయం వాస్తవం కాదా?” అని నేరుగా ప్రశ్నించారు. ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు ప్రారంభించింది. చివరకు సీఎం రేవంత్ రెడ్డి కొనుగోళ్ల ప్రక్రియలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తామని ప్రకటించడం కూడా మహేశ్వర్ రెడ్డి గారి ఒత్తిడి, బీజేపీ క్షేత్రస్థాయి పోరాటం వల్లే సాధ్యమైంది అంటున్నారు.
