Telangana BJP : బీజేపీ టికెట్ కోసం పోటీ.. నాలుగో రోజు సైతం భారీగా అప్లికేషన్లు, మారని ముఖ్యనేతల తీరు
కాగా.. ఒక్కో వ్యక్తి నాలుగు, ఐదు స్థానాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. తనకు 5 అసెంబ్లీ స్థానాలలో టికెట్ ఇవ్వాలని.. Telangana BJP Applications

Telangana BJP Applications (Photo : Google)
Telangana BJP Applications : హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నాలుగో రోజు ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావహుల నుండి దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. నాలుగో రోజు (సెప్టెంబర్ 7) సైతం ఎమ్మెల్యే టికెట్ కోసం భారీగా అప్లికేషన్లు వచ్చాయి. 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర కార్యాలయంలో ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించారు. ఆశావహుల నుండి వస్తున్న స్పందనను ఆయన అడిగి తెలుసుకున్నారు.
కాగా.. ఒక్కో వ్యక్తి నాలుగు, ఐదు స్థానాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. తనకు 5 అసెంబ్లీ స్థానాలలో టికెట్ ఇవ్వాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీత మూర్తి అప్లికేషన్స్ పెట్టుకోవడం గమనార్హం. బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప నారాయణ ఖేడ్ కు అప్లయ్ చేసుకున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ పై పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఓయూ విద్యార్థి నేత పుల్లారావు యాదవ్ అప్లికేషన్ పెట్టుకున్నారు.(Telangana BJP)
ఇదిలా ఉంటే.. బీజేసీ ముఖ్యనేతలు, సీనియర్ల తీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. నాలుగో రోజు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ముఖ్య నేతలు ఎవరూ అప్లయ్ చేసుకోలేదు. దరఖాస్తు సిస్టమ్ ను బీజేపీ సీనియర్ నాయకులు అసలు పట్టించుకోనేలేదు. ఎందుకిలా అని అడిగితే.. మంచి రోజు కోసం ఆగుతున్నాం అని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.
కాగా, ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావహుల నుంచి వస్తున్న దరఖాస్తులపై ఆరాతీసిన బీజేపీ ఎన్నికల ఇంఛార్జి ప్రకాశ్ జవదేకర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్య నేతలు ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎంత పెద్ద నాయకుడు అయినా టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సిందేనని ప్రకాశ్ జవదేకర్ తేల్చి చెప్పారు. కాగా, దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్య నేతలు అంతగా ఆసక్తి చూపడం లేదు. దరఖాస్తు చేసుకోకపోతే టికెట్ ఇవ్వరా అంటూ సీనియర్లు సెటైర్లు కూడా వేసుకుంటున్నారు.
తెలంగాణలో ఎన్నికల కోలహలం నెలకొంది. రాష్ట్రంలో డిసెంబర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నట్లు సమాచారం. దాంతో అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రముఖ ఘట్టమైన అభ్యర్థుల ఎంపికలో కసరత్తును ముమ్మరం చేశాయి. ీ విషయంలో అధికార బీఆర్ఎస్ దూకుడు మీదుంది. ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. బీజేపీ, కాంగ్రెస్ ఆ పనిని ముమ్మరం చేశాయి.
ఇటీవలే ఎమ్మెల్యే ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది కాంగ్రెస్. వెయ్యికి పైగా అప్లికేషన్లు రావడంతో పార్టీ ప్రాధాన నాయకులు ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ అంశంపై స్క్రీనింగ్ కమిటీని వేసింది. కాంగ్రెస్ పార్టీ త్వరలోనే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.
ఇక బీజేపీ కూడా అదే పనిలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయాలని భావిస్తున్న నాయకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు తీసుకుంటారు. దరఖాస్తుల పరిశీలన కోసం స్క్రీనింగ్ కమిటీని బీజేపీ ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. ఈ నెల 17 తర్వాత అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.