Telangana Cabinet Meeting
Telangana Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ రేపు భేటీ కానుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఆగస్టు 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో చర్చించాల్సిన కీలక అంశాలపై ఈ భేటీలో డిస్కస్ చేయనున్నారు.
దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేబినెట్ చర్చించనుంది. తెలంగాణలో వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ లో చర్చ జరగనుంది.
కుండపోతగా కురిసిన వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోయి రవాణ మార్గాలకు జరిగిన తీవ్ర నష్టంపై అంచనా వేయనుంది. యుద్ధ ప్రాతిపదికన రోడ్లను పునరుద్దరించడం కోసం చేపట్టాల్సిన చర్యలపైనా కేబినెట్ లో చర్చించనున్నారు.
Also Read..Rajanna Siricilla : బ్లఫ్ మాస్టర్ సినిమా తరహాలో ఘరానా మోసం.. రూ.50 కోట్లకు కుచ్చు టోపీ
తెలంగాణ నూతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశంలో 50 అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, ప్రభావిత ప్రాంతాలు, ఆయా పరిస్థితులపై మంత్రి మండలిలో డిస్కస్ చేయనున్నారనా సమాచారం. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు సంబంధించి నీటి సామర్ధ్యం, ప్రస్తుత నీటిమట్టం ఇలా అనేక అంశాలపై చర్చించే ఛాన్సుంది. కేబినెట్ భేటీ సుదీర్ఘంగా జరగనుందని, ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. ఇక, వచ్చే నెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపైనా కేబినెట్ లో చర్చించనున్నారు.