×
Ad

CM Revanth Reddy : విద్య, ఉద్యోగాలు, పెట్టుబడులు.. తర్వాత రేవంత్ రెడ్డి టార్గెట్ ఇదే!

Revanth Reddy : వైద్య ఆరోగ్యశాఖపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వాసుపత్రి సేవల్ని గ్రామస్థాయిలోనూ బలోపేతం చేసే...

CM Revanth Reddy

CM Revanth Reddy : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే వైద్య ఆరోగ్యశాఖపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వాసుపత్రి సేవల్ని గ్రామస్థాయిలోనూ బలోపేతం చేసే పలు కీలకమైన కార్యక్రమాల్ని చేపట్టారు. రెండేళ్ల ప్రజా ప్రభుత్వంలో ఆశించిన స్థాయిలో ఈ ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది నియామకం, ఆస్పత్రుల నిర్మాణం, వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కళాశాలల్లో సీట్ల పెంపు లాంటి చర్యలతో తెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖలో అద్భుతమైన ఫలితాలు సాకారమవుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహ ప్రత్యేక శ్రద్ధతో జూనియర్‌ డాక్టర్లకు స్టైఫండ్‌ పెంపు మొదలు.. ప్రతి చిన్న సమస్యనూ పరిష్కరిస్తూ.. ఈ శాఖ బలోపేతానికి కృషిచేస్తున్నారు.

రూ.10లక్షలకు పెంపు ..
ప్రజాప్రభుత్వంలో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచారు. 1375 వైద్య చికిత్సల ధరలను సుమారు 22 నుంచి 25శాతం వరకూ పెంచారు. కొత్తగా 163 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇలా ఆరోగ్యశ్రీ కింద 1835 చికిత్సలు చేరాయి. లక్షల మంది రోగులకు ప్రయోజనం కలిగింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఖ్యను గణనీయంగా పెంచారు. ఏజెన్సీ ప్రాంతాలుగా ఉన్న ములుగు, నారాయణపేట లాంటి మారుమూల జిల్లాల్లో ప్రభుత్వాసుపత్రుల సేవలు విస్తృతమయ్యాయి.

కార్పొరేట్‌ తరహా వైద్య సదుపాయాలు..
ఒకప్పుడు కేవలం అలంకారప్రాయంగా ఉన్న ప్రభుత్వాసుపత్రులకు రోగులు చికిత్సకు రావాలంటే భయపడే పరిస్థితి. ఇప్పుడు కార్పొరేట్‌ తరహా వైద్య సదుపాయాల కల్పనతో మెల్లగా మార్పు వచ్చింది. వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, ఫార్మాసిస్ట్‌లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్టులు, వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల సంఖ్యను పెంచేందుకు భారీగా నియామకాలు చేపట్టింది. ఇలా 2 ఏళ్లలో 9 వేల పైచిలుకు పోస్టులు భర్తీ అయ్యాయి. మరో 7 వేలకు పైగా పోస్టుల భర్తీ జరగనుంది. కొత్తగా 9 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలలొచ్చాయి. ఒక్కో కాలేజీలో 50 సీట్లతో 450 ఎంబీబీఎస్‌ సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అదనంగా వచ్చాయి. ఇలా ఎంబీబీఎస్‌ కళాశాలలో సీట్ల సంఖ్య 3,690 నుంచి 4,140కి పెరిగింది.

మెడికల్ కాలేజీ విద్యార్థుల సౌకర్యం కోసం..
ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థుల సౌకర్యం కోసం.. రూ. 204 .85 కోట్లతో కొత్త హాస్టల్స్‌ బిల్డింగ్స్‌ను మంజూరు చేసింది ప్రభుత్వం. జూనియర్‌ డాక్టర్ల స్టైఫండ్‌, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్ల గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచింది. దేశంలోనే అత్యధిక స్టైఫండ్స్‌ ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌ 5లో ఉంది. కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో నర్సింగ్ కాలేజీలో 60 సీట్లు చొప్పున అద‌నంగా 960 సీట్లు తెలంగాణకు వచ్చాయి. నర్సింగ్ కాలేజీల సంఖ్య 21 నుంచి 37కు పెరిగింది. ఇలా మొత్తం సీట్ల సంఖ్య 1,400 నుంచి 2,360కి పెరిగింది. అంతే కాదు.. నర్సులకు దేశ, విదేశాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించేలా.. ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ సహకారంతో .. ఇంగ్లీష్‌, జర్మన్‌, జపనీస్‌ భాషల్ని నర్సింగ్‌ విద్యార్థులకు నేర్పిస్తోంది.

భారీ సంఖ్యలో పారా మెడికల్‌ సీట్లు ..
కొత్తగా 28 పారా మెడికల్‌ కాలేజీలతో రాష్ట్రంలో ప్రభుత్వ పారా మెడికల్‌ కాలేజీల సంఖ్య 12 నుంచి 40కి పెరిగింది. ఇందులో ఒక్కో కాలేజీలో 60 సీట్లతో.. అదనంగా 1680 పారా మెడికల్‌ సిబ్బంది సీట్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో 3,172 పారా మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి జిల్లాలో ఎన్‌సీడీ క్లినిక్స్‌తో 50 లక్షల మంది పేషెంట్లకు వైద్యం అందుతోంది. అన్ని జిల్లా కేంద్రాల్లో డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లను ప్రారంభించారు. కిడ్నీ సమస్యల పరిష్కారానికి డయాలసిస్‌ సెంటర్ల సంఖ్యను పెంచారు. హైదరాబాద్‌లో గాంధీ, ఉస్మానియా, వరంగల్‌లో ఎంజీఎం, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో గవర్నమెంట్‌ జనరల్‌ ఆస్పత్రులు, ఆదిలాబాద్‌ రిమ్స్‌లో వాస్క్యులర్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. 33 కోట్ల రూపాయలతో కొత్తగా 18 డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.

అందుబాటులోకి కొత్త అంబులెన్సులు..
ప్రతి మండలానికి అంబులెన్స్‌ ఉండేలా కొత్తగా 213 ఆంబులెన్స్‌లను ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్స్‌ 14 నిమిషాల్లో చేరుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 18 నిమిషాల నుంచి 13 నిమిషాలకు తగ్గింది. త్వరలో మరో 77 అంబులెన్స్‌లు తీసుకురానున్నారు. ఇలా 74 ట్రామా కేర్‌ సెంటర్లు అందుబాటులోకొస్తున్నాయి. మొత్తంగా ప్రజాప్రభుత్వంలో తెలంగాణను మెడికల్‌ హబ్‌గా మార్చే ప్రణాళికలు అమలు దిశగా వేగంగా సాగుతున్నాయి.