Telangana Congress leaders reacted funny to Bandi Sanjay's comments on CM KCR
Telangana politics : దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నాడట వెనుకడికి ఎవరో…అలా ఉంది తెలంగాణలో కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలకు మరో పార్టీ నేతలు స్పందిన తీరు చూస్తుంటే..అసలు విషయం ఏమిటంటే..ఎప్పుడు సీఎం కేసీఆర్ పై విరుచుకుపడే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తనదైన శైలిలో మరోసారి గులాబీ బాస్ పై విమర్శలు చేశారు. ఏమనంటే..‘కేసీఆర్ కోసం జైల్లో సెల్ రెడీగా ఉంది‘అని వ్యాఖ్యానించారు. బండి చేసిన ఈ వ్యాఖ్యలపై సాధారణంగా అయితే టీఆర్ఎస్ నేతలు తిరిగి ఎదురు దాడి చేస్తారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే..బండి సంజయ్ కేసీఆర్ కోసం జైల్లో సెల్ రెడీగా ఉందని అన్న వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు స్పందించారు. బండి సంజయ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
బండి కేసీఆర్ ను విమర్శించటానికి..ఆరోపణలు చేయటానికి అన్న జైలు..సెల్ అన్నమాటలకు కాంగ్రెస్ నేతలు ఎంతగా రియాక్ట్ అయ్యారంటే ఏకంగా దండూ తాళం కట్టుకుని ఓ గుంపులాగా జైలును సందర్శించారు ‘జైల్లో కేసీఆర్ కు కేటాయించిన సెల్’ఎక్కడుందో? ఎలా ఉందో చూడటానికి వివరాలు తెలుసుకోవటానికి ఏకంగా జైలుకే వెళ్లారు. వెళ్లటమేకాదు ఏకంగా జైలు సూపరింటెండెంట్ ను వివరాలు అడిగారు. దానికి సదరు సూపరింటెండెంట్ షాక్ అయ్యారో ఏమో గానీ ఆయన కూడా అటువంటి దానికి అవకాశమే లేదని చెప్పారట..ఇదింకా విడ్డూరంగా లేదూ..?!!
ఈ ఘనకార్యంపై జైలును సందర్శించాక తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ..బండి సంజయ్ పై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ అబద్ధాలు ఆడుతున్నారని…కరీంనగర్ పరువు తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..జైలు రూల్ ప్రకారంగా జైల్లో ఉన్న ఖైదీలు జైల్లో రూమ్ కట్టటానికి అవకాశం లేదు అంటూ ఏదో కొత్త విషయాన్ని కనుగొన్నట్లుగా చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే బండి సంజయ్ ఎంతగా అబద్ధాలు ఆడతారో ప్రజలు తెలుసుకోవాలి అంటూ కాంగ్రెస్ కండువా వేసుకున్న టీఆర్ఎస్ నేతలా మాట్లాడారు.