Telangana Congress Leaders Sensational Allegations
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్టకేలకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు ఫుల్ ఖుషీగా ఉన్నాయి. అయితే, ఇంతలోనే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది అనే ఆరోపణలు రావడం కలకలం రేపాయి. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేతలు.
దీనిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ రవిగుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ సర్కార్ ను కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజాసింగ్, బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అన్నారు. దీనిపై లోతుగా దర్యాఫ్తు చేయాలని డీజీపీని కోరామన్నారు కాంగ్రెస్ నేతలు.
Also Read : అన్ని శాఖల్లోను అప్పులే.. అయినా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
”6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని రాజాసింగ్, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. దీంతో మాకు అనుమానం కలుగుతోంది. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్.. రెండూ కలిసి తోడు దొంగల్లా మారి ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు అనే అనుమానాలు కలుగుతున్నాయి” అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
కాగా, తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కుప్పకూలబోతుంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ వచ్చేది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు వారికి వారే ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటారని పల్లా అన్నారు. అటు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం 6 నెలల్లో లేదా ఏడాది లోపు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : 3 రాష్ట్రాల సీఎంలుగా గిరిజన, యాదవ, బ్రాహ్మణ.. 2024 ఎన్నికల ఎజెండాను ఫిక్స్ చేసిన బీజేపీ?
ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఇలాంటి కామెంట్సే చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది మాత్రమే ఉంటుందని తర్వాత కూలిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదని, ఏడాదికి మించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుందని రాజాసింగ్ చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చేలేక కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే మరిన్ని అప్పులు చేయాల్సి ఉంటుందని, ఇవన్నీ భరించలేక కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రేగి దిగిపోతుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అంటే.. ఇలా వరుసగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.