TG Electricity Charges Hike : విద్యుత్ వినియోగదారులకు బిక్ షాక్.. వచ్చే నెల నుంచి ఛార్జీ మోత షురూ.. ఎంతంటే?
TG Electricity Charges Hike : తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాకింగ్ న్యూస్. వచ్చేనెల నుంచి మీ కరెంట్ బిల్లు పెరగనుంది.
Telangana Electricity Bills
TG Electricity Charges Hike : తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాకింగ్ న్యూస్. వచ్చేనెల నుంచి మీ కరెంట్ బిల్లు పెరగనుంది. కరెంట్ ట్రూఆప్ ఛార్జీల్లో భాగంగా బిల్లులు పెరగనున్నాయి. తాజా లెక్కల ప్రకారం.. నవంబర్ నెలలో ప్రతి యూనిట్‌కు 30 పైసలు.. ఆ తరువాత నెల నుంచి సుమారు రెండేళ్లపాటు యూనిట్‌కు 50పైసలపాటు అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న వినియోగదారులకు ప్రస్తుతం పెరిగిన విద్యుత్ ఛార్జీలు మరింత అదనపు భారం కానున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయి.. ట్రూఆప్ ఛార్జీలు అంటే ఏమిటనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
Also Read : Gold-Silver Prices Today : పండుగ వేళ గోల్డెన్ ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం రేట్లు.. తులం ఎంతంటే?
విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడనుంది. డిస్కంలు వసూలు చేయనున్న రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) అనుమతి ఇచ్చింది. అయితే ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. మిగిలిన రూ.5,420.23 కోట్లను గృహ, వాణిజ్య, ఇతర అర్హత కలిగిన వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. ఈ మేరకు టీజీఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది.
2022-23లో విద్యుత్ కొనుగోలుకు అదనంగా ఖర్చయిన రూ.5,186.29 కోట్లు, 2023-24లో వచ్చిన రూ.2,448.93 కోట్ల రెవెన్యూ లోటు ఆధారంగా ఈ ట్రూ-అప్ ఛార్జీలను నిర్ణయించారు. విద్యుత్ సంస్థలు ముందుగా అంచనా వేసిన ఖర్చు కంటే వాస్తవంగా ఎక్కువ ఖర్చు అయితే ఆ వ్యత్యాసాన్ని సర్దుబాటు చేసుకునే ప్రక్రియనే ట్రూ-అప్ ఛార్జీలుగా పిలుస్తారు. ఈ మొత్తాన్ని తెలంగాణ డిస్కంలైన టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ ద్వారా వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు.
వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లలో ఎస్పీడీసీఎల్కు రూ.1,442.49 కోట్లు, ఎన్పీడీసీఎల్కు రూ.772.50 కోట్లు ప్రభుత్వ సబ్సిడీగా అందనున్నాయి. మిగిలిన రూ.5,420.23 కోట్లలో ఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.4,222.93 కోట్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలో రూ.1,197.30 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. నవంబర్ 2026 నుంచి విద్యుత్ బిల్లుల్లో ట్రూ-అప్ ఛార్జీలు కనిపించనున్నాయి.
మొదటి నెలలో వినియోగించిన ప్రతి యూనిట్‌కు 30 పైసలు చొప్పున అదనంగా వసూలు చేస్తారు. ఆ తర్వాత నెల నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున ట్రూ-అప్ ఛార్జీ విధించనున్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులు 29 నెలలు, ఎన్పీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులు 26 నెలలు ఈ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వినియోగించిన విద్యుత్ ఆధారంగానే ఈ వసూళ్లు జరగనున్నాయి. బిల్లులో ట్రూ-అప్ ఛార్జీలను ప్రత్యేకంగా చూపించడంతో పాటు ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినదో, ఎంత వినియోగాన్ని పరిగణనలోకి తీసుకున్నారో, యూనిట్‌కు ఎంత రేటు విధించారో స్పష్టంగా పేర్కొనాలని టీజీఈఆర్సీ ఆదేశించింది.
ఒకే బిల్లులో రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వసూళ్లు ఉంటే వాటిని విడివిడిగా చూపించాలి. అంటే.. నవంబర్ నుంచి కరెంట్ బిల్లు సాధారణం కంటే పెరిగే అవకాశం ఉండటంతో తెలంగాణ విద్యుత్ వినియోగదారులు అదనపు భారానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.
