Telangana Govt : తెలంగాణ సర్కార్ బిగ్ డెసీషన్.. నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ప్రతినెలా రూ.5వేలు..
Telangana Free UPSC Coaching 2027 : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2027కు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం హైదరాబాద్‌లో ఉచిత కోచింగ్ నిర్వహించనుంది.
Free UPSC Coaching 2027
- నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
- UPSC ఉచిత కోచింగ్.. ప్రతీ నెల రూ.5వేలు స్టైపెండ్
- ముఖ్యమైన తేదీలు.. అర్హతలు ఇవే..
Telangana Free UPSC Coaching 2027 : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2027కు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఉచిత కోచింగ్‌తోపాటు.. ప్రతీనెలా రూ.5వేలు స్టైపెండ్ అందించనుంది. అలాగే లైబ్రరి వసతి కూడా కల్పించనుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ ఉంటుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారిక ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2027కు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం హైదరాబాద్‌లో ఉచిత కోచింగ్ నిర్వహించనుంది. ఈ కోచింగ్ సైదాబాద్‌లోని లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న టీజీ బీసీ స్టడీ సర్కిల్లో 2026 ఆగస్టు 24 నుంచి 2027 మే వరకు కొనసాగుతుంది.
మొత్తం 150మంది అభ్యర్థులకు ఈ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. ఇందులో రాత పరీక్ష ద్వారా 100మంది ఎంపిక చేస్తారు. ఇప్పటికే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన 50మందికి నేరుగా అవకాశం కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగిం చేసుకోవాలనుకునే వారు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
అర్హులు వీరే..
♦ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయ్యి ఉండాలి.
♦ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
♦ కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షలలోపు.. పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షల లోపు ఉండాలి.
♦ ప్రస్తుతం ఏ ఉద్యోగం కానీ, ఇతర విద్యా కోర్సులు అభ్యసించడం కానీ చేయకూడదు.
ముఖ్యమైన తేదీలు..
♦ ఉచిత కోచింగ్కోసం ఆన్లైన్ దరఖాస్తుకు ఆగస్టు 7వ తేదీ వరకు అవకాశం ఉంది.
♦ హాల్ టికెట్స్ ఆగస్టు 13 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
♦ పరీక్ష ఆగస్టు 16వ తేదీన ఉంటుంది. ఫలితాలు 19వ తేదీన వెల్లడి కానున్నాయి.
♦ ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 24 నుంచి కోచింగ్ ప్రారంభమవుతుంది.
UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ సూచించింది. దరఖాస్తులను నిర్ణీత గడువులోగా ఆన్లైన్లో సమర్పించాలని తెలిపింది.
