Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. ఇల్లు కట్టే పని లేదు.. వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు..
Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేస్తామని ప్రకటించింది.
telangana government gave incomplete 2bhk houses rs 5 lakh aid to indiramma l2 beneficiaries
- ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త
- వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు
- రూ.5 లక్షల సాయం
Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేదల సొంతింటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. అలానే ఇంటి జాగా లేని వారికి స్థలం కూడా కేటాయిస్తోంది. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి నిర్మాణం కోసం సొంతంగా జాగా లేని వారికి శుభవార్త చెప్పింది. వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించేందుకు ముందుకు వచ్చింది.
గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టి వివిధ కారణాల వల్ల మధ్యలో ఆగిపోయిన, పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఇకపై ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన వారికి కేటాయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 18,816 డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు మంజూరు కాగా అందులో ప్రస్తుతం సుమారు 10,353 ఇళ్ల నిర్మాణం పూర్తైంది. అయితే, లబ్ధిదారుల ఎంపిక జరగని 5 వేల ఇళ్లతో పాటు, అసంపూర్తిగా ఉన్న మరో 3,550 ఇళ్లను కలిపి మొత్తం 8 వేల పైచిలుకు ఇళ్లను ఇందిరమ్మ పథకంలోని L2 కేటగిరికి చెందిన అంటే సొంత స్థలం లేని పేదలకు అప్పగించనున్నారు.
అలానే నిర్మాణం మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసే బాధ్యతను లబ్ధిదారులకు అప్పగించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీని కోసం ఆయా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పాత కాంట్రాక్టర్లతో చేసుకున్న అగ్రిమెంట్లను రద్దు చేసి వాటిని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించనుంది. అలానే మధ్యలో వదిలేసిన ఇంటి నిర్మాణాలను పూర్తి చేయడానికి గాను ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. లబ్ధిదారులే స్వయంగా పనులు చూసుకోవడం వల్ల నాణ్యత పెరగడంతో పాటు పనులు త్వరగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించిన ప్రభుత్వం, త్వరలోనే రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.
