Praja Palana Applications
Praja Palana : తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోపు అమలు చేసేలా కార్యాచరణ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారుల ఎంపికను చేపట్టింది. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకోసం దరఖాస్తుల స్వీకరణ ఇవాళ్టి నుంచి మొదలైంది. జనవరి 6వ తేదీ వరకు అధికారులు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అయితే, ప్రజా పాలన కౌంటర్ల వద్ద ఉదయం నుంచే దరఖాస్తు దారులు బారులు తీరారు. పలుచోట్ల దరఖాస్తులు దొరక్క ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read : అభయ హస్తం 6 గ్యారెంటీల దరఖాస్తులు ఎలా నింపాలి.. ఏయే పత్రాలు కావాలి?
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అర్హులందరికీ ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అందిస్తామని భట్టి చెప్పారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఇది ప్రజా ప్రభుత్వం అన్నారు. మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం తమది కాదని చెప్పారు. గ్రేటర్ లోని బంజారాహిల్స్ లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రజలకు సందేహాలుంటే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో 600 కేంద్రాల్లో ప్రజా పాలన కార్యక్రమం జరుగుతోందని అన్నారు. ఎలాంటి పైరవీలకు అవకాశం లేదని, అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
ఇదిలాఉంటే ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారంను బుధవారం సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఆరు గ్యారెంటీలకు అప్లయ్ చేసుకునే వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ పెట్టాలని సూచించారు. అయితే, కొత్తగా వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి సదరం సర్టిఫికెట్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఫ్రీ సిలీండర్ కోసం గ్యాస్ బుక్, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ కోసం మీటర్ కనెక్షన్ నెంబర్, కరెంట్ బిల్లు ఉండాలని తెలిపింది. మరోవైపు వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ కార్డు తప్పనిసరి అని, రైతు భరోసాకు దరఖాస్తు చేయాలంటే పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ లు, సర్వే నెంబర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.