Telangana Age Limit : నిరుద్యోగులకు శుభవార్త.. వయోపరిమితి భారీగా పెంపు.. ఎన్నేళ్లంటే…!
Telangana Age Limit : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు శుభవార్త. వయోపరిమితిని భారీగా పెంచారు
telangana government increases upper age limit for govt jobs upto 10 years
- నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త
- వయోపరిమితి 10 సంవత్సరాలు పెంపు
- యూనిఫామ్ ఉద్యోగాలకు వర్తించదు
Telangana Age Limit : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ పండగలాంటి శుభవార్త చెప్పింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యం అవుతోంది.. దీంతో తమకు వయసు అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని ఏకంగా 10 సంవత్సరాలు పెంచింది.
అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇప్పటివరకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లు ఉండగా.. దాన్ని ఇప్పుడు 44 ఏళ్లకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 10 ఏళ్ల సడలింపు సంవత్సరకాలం పాటు అమల్లో ఉంటుందని పేర్కొంది. దీంతో త్వరలో విడుదల చేయబోయే నోటిఫికేషన్లలో ఎందరో నిరుద్యోగులకు అప్లై చేసుకునేందుకు అవకాశం లభించనుంది. అయితే యూనిఫామ్ సర్వీసులకు ఈ సడలింపు వర్తించదని అధికారులు చెబుతున్నారు.
* నిరుద్యోగులకు శుభవార్త.. అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఈ పత్రాలు ఉంటే చాలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉద్యోగ నియామకాల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. ఆ తర్వాత కరోనా సమయంలో ఏర్పడిన పరిస్థితులు వల్ల పలు ఉద్యోగ ప్రకటనలు వెలువడకపోవడం వంటి కారణాలతో అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారు. దీంతో తమకు అవకాశం కల్పించాలని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. ఈ అభ్యర్థనలను పరిశీలించిన ప్రభుత్వం వయోపరిమితిపై పదేళ్ల సడలింపు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని విభిన్న నియామక సంస్థలు విడుదల చేసే సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఈ నూతన వయో పరిమితి పెంపు నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. అయితే శారీరక దారుఢ్య పరీక్షలు అవసరమైన యూనిఫాం శాఖల ఉద్యోగాలు అంటే.. పోలీస్, అగ్నిమాపక, మద్యం నియంత్రణ, జైలు, అటవీ శాఖల నియామకాల్లో ఈ వయోపరిమితి సడలింపు వర్తించదు. అంటే ఈ ఉద్యోగాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న పాత వయో నిబంధనలే కొనసాగనున్నాయి.
