Indiramma houses
Indiramma Illu: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా రేవంత్ సర్కార్ దృష్టిసారించింది. ఈ క్రమంలో ఇప్పటికే గ్రామాల వారిగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 72వేల మంది లబ్ధిదారులను ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రెండో విడత లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తోంది. ఈ జాబితాను ఈ నెలాఖరులోగా ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Also Read: Telangana Rains : తెలంగాణలో మళ్లీ వర్షాలు..! ఆ రెండు రోజులు వానలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రెండో విడతలో లబ్ధిదారుల ఎంపికపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రతీ గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక ఉండేలా జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. లబ్ధిదారుల జాబితా ఎంపికలో ఎమ్మెల్యేల సూచనలను అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. రెండు విడుతల్లో కలిపి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల మంది లబ్ధిదారులతో జాబితా రూపొందించి ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also Read: HCU Lands Dispute : రంగంలోకి మీనాక్షి నటరాజన్.. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ తరువాత నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేలోగా కనీసం పునాది, పిల్లర్ల వరకు నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాలో సంబంధిత సొమ్ము జమ చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇదిలాఉంటే.. మొదటి విడతలో ఎంపిక చేసిన 72వేల మంది లబ్ధిదారులకు గాను 42వేల మందికే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మంజూరు పత్రాలను ప్రభుత్వం జారీ చేసినట్లు తెలిసింది. మిగతా 30వేల మంది లబ్ధిదారులపై మళ్లీ విచారణ చేపడుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో రెండో జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్ర స్థాయిలో పూర్తిస్థాయి విచారణ చేసిన అనంతరం లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందికి మార్గదర్శకాలు చేసినట్లు తెలిసింది.