Telangana Rains : తెలంగాణలో మళ్లీ వర్షాలు..! ఆ రెండు రోజులు వానలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

Telangana Rains : తెలంగాణలో మళ్లీ వర్షాలు..! ఆ రెండు రోజులు వానలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!

Telangana Rains

Updated On : April 5, 2025 / 8:22 PM IST

Telangana Rains : తెలంగాణకు మళ్లీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వానలు కురవనున్నాయి. ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రేపు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.

7వ తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

Also Read : కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేత ఎఫెక్ట్.. పొంచి ఉన్న ప్రమాదం, 4 డిగ్రీల వరకు పెరగనున్న ఉష్ణోగ్రతలు..!

ఇక 8వ తేదీన కూడా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉరుములతో, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా ప్రజలు తీవ్రమైన ఎండ, ఉక్కపోత నుంచి ఊరట పొందారు. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో క్యుములో నింబస్‌ మేఘాలు ఏర్పడి వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. క్యుములో నింబస్‌ కారణంగా వడగండ్ల వానలు పడొచ్చని హెచ్చరిస్తోంది. అకాల వర్షాల కారణంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.