Mee Seva Charges : బిగ్ అలర్ట్.. 36గంటలు ‘మీసేవ’ కేంద్రాల్లో సేవలు బంద్.. మళ్లీ పున: ప్రారంభం ఎప్పుడంటే?
Mee Seva Charges : మీసేవ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది.ఈ మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ జీవో నెంబర్ 1ని విడుదల చేసింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
- Harish Thanniru
- Updated on- April 4, 2026 / 05:00 PM IST
Telangana Mee Seva Service Charges
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- మీసేవా ఛార్జీలు భారీగా పెంపు
- 36 గంటలు మీ సేవ కేంద్రాల్లో సేవలు బంద్
TG MeeSeva Charges : తెలంగాణ రాష్ట్రంలో పౌర సేవలను డిజిటల్ రూపంలో ప్రజలకు చేరవేసే మీ సేవా కేంద్రాల్లో ఛార్జీల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఆయా సేవలపై 18శాతం జీఎస్టీని ఇకపై వినియోగదారులే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ జీవో నెంబర్ 1ని విడుదల చేసింది. దాదాపు 15ఏళ్ల తరువాత మీసేవా నిర్వాహకుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. సర్వీస్ ఛార్జీలను 50శాతం వరకు పెంచారు. దీనికి 18శాతం జీఎస్టీ అదనంగా చేరడంతో సామాన్యులపై సుమారు 77శాతం నుంచి 78శాతం వరకు భారం పడనుంది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త సేవా రుసుములను సిస్టమ్‌లో అప్డేట్ చేయడం, సాఫ్ట్‌వేర్ ఆధునీకరణ పనుల కారణంగా 4, 5 తేదీల్లో (శని, ఆదివారం) మీ సేవా కేంద్రాల్లో సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో 36గంటలు పాటు సర్వర్లు అందుబాటులో ఉండవని ప్రభుత్వం తెలిపింది. సోమవారం నుంచి మీసేవా కేంద్రాల్లో సేవలు పున:ప్రారంభం అవుతాయి.
ఆదాయం, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, జనన మరణ రిజిస్ట్రేషన్లు, భూమి సంబంధిత సేవలతో సహా మొత్తం 500కుపైగా ప్రభుత్వ సేవలు మీసేవా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంటాయి. అయితే, తాజాగా మీ సేవాలో అందించే సేవలను రెండు కేటగిరీల వారిగా విభజించారు.
కేటగిరీ -ఏ కింద సేవలకు వసూలు చేసే రుసుం గతంలో రూ.35గా ఉండగా.. ప్రస్తుతం రూ.62కు పెంచారు. ఈ క్యాటగిరీలో అడంగల్, పహాణీ, జనన ధ్రువీకరణ పత్రం ప్రింట్ వంటి తక్షణ సేవలు ఉన్నాయి. కేటగిరీ -బీలో గతంలో రూ.45 చెల్లించేవారు.. ప్రస్తుతం కొత్త రుసుము ప్రకారం రూ.80 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కుల, ఆదాయం, నివాసం, జనన, మరణ ధ్రువీకరణ, భూభారతి ఈ-కేవైసీ, కొత్త విద్యుత్తు కనెక్షన్ దరఖాస్తు వంటి సేవలున్నాయి.
ప్రింట్ల విషయానికొస్తే.. మొదటి నాలుగు పేజీల తరువాత ఇచ్చే ప్రతీ పేజీకి వసూలు చేసే స్కానింగ్, ప్రింటింగ్ ఛార్జీలు కూడా పెంచారు. ఇప్పటి వరకు రూ.2 ఉండగా.. దాన్ని రూ.2.50కి పెంచారు. కరెంటు బిల్లు రూ.200 వరకు ఉంటే రూ.4కి పెంచగా.. అంతకంటే ఎక్కువ మొత్తాలపై రూ.9 నుంచి 44 వరకు చెల్లించే బిల్లును బట్టి వసూలు చేయనున్నారు.
అధికారికంగా సవరించిన ధరల కంటే ఎక్కువగా మీ సేవ కేంద్రాల నిర్వాహకులు వసూళ్లు చేసినట్లయితే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్: 1800-425-1110, పౌరసేవా సంఖ్య: 1100 కు ఫిర్యాదు చేయొచ్చు.
