Padi Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ సీరియస్.. చర్యలకు ఈసీకి ఆదేశం

గతేడాది నవంబర్ 28న ఎన్నికల ప్రచారంలో భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..

Padi Kaushik Reddy and Governor Tamilisai

Governor Tamilisai: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి గవర్నర్ సూచించారు. గురువారం జేఎన్టీయూలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో పత్యర్థి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై విజయం సాధించారు. అయితే, ఎన్నికల ప్రచారం చివరి దశలో తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో కలిసి బలవన్మరణానికి పాల్పడతానని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తాజాగా సీరియస్ అయ్యారు. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పి గెలవాలని, అలాకాకుండా కెమెరా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసి బెదిరించి ఓట్లు అడగడం సరికాదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి గవర్నర్ సూచించారు.

Also Read : Koushik Reddy : బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం సీరియస్‌

గతేడాది నవంబర్ 28న ఎన్నికల ప్రచారంలో భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. మీ అందరికి ఒక్కటే చెబుతున్నా.. ఎన్నికల ఫలితాల తరువాత మీరు మా విజయ యాత్రకు రావాలా.. మా శవయాత్రకు రావాలా అనేది మీరే తేల్చాలని ప్రజలను కోరారు. మమ్మల్ని మీరే కాపాడాలి.. మా జీవితాలు, మా ప్రాణాలను అన్నీ మీచేతుల్లో పెట్టామంటూ కౌశిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈసారి ఓడిపోతే మేమంతా బలవన్మరణానికి పాల్పడడమే అవుతుందని అన్నారు. అయితే, ఆ సమయంలో ఈసీకి ఫిర్యాదు వెళ్లాయి. స్పందించిన ఈసీ సుమోటోగా కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. తాజాగా గవర్నర్ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి సూచించారు. తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ కూడా అదే కార్యక్రమంలో ఉన్నారు. గవర్నర్ సూచనలతో కౌశిక్ రెడ్డిపై ఈసీ చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.

ఇదిలాఉంటే గతంలోనూ కౌశిక్ రెడ్డి విషయంలో గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంతో విభేదించారు. కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేయాలన్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు