bathukamma sarees
Bathukamma Sarees : ఈనెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు మొదలుకాబోతున్నాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో మాదిరిగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. బతుకమ్మ పండుగ సమీపిస్తున్న వేళ మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ‘అక్కా-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరిట చేనేత చీరల పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
అయితే, గత ప్రభుత్వంలో ఒక్కో మహిళకు ఒక చీర కానుకగా ఇచ్చేవారు.. ప్రస్తుత ప్రభుత్వం అందుకు భిన్నంగా స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) సభ్యులకు మాత్రమే చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు.. వారికి రెండేసి చొప్పున చీరలు ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Also Read: ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ.. ఆ పదిమందిలో నలుగురిపై వేటు పడటం ఖాయమా? రిజైన్ చేస్తారా?
కాగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆధార్ కార్డు ఉంది.. 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరలను ప్రభుత్వం కానుకగా ఇచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయ సంఘాల్లోని సభ్యులకు మాత్రమే చీరలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే వారం నుంచి వారికి బతుకమ్మ చీరల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
గ్రేటర్ హైదరాబాద్‌లో బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇందిరా మహిళా శక్తి పేరుతో బతుకమ్మ పండుగకు ముందుగానే చీరలను పంపిణీ చేయనున్నారు. తెలంగాణ హ్యాండ్ లూమ్స్ డిపార్టుమెంట్ నుంచి సోమవారం జీహెచ్ఎంసీకి చీరలు చేరాయి. స్వయం సహాయక సంఘాల గ్రూపు మహిళలకు జీహెచ్ఎంసీ అధికారులు ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో 49,714 గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 10మంది చొప్పున మహిళలు ఉన్నారు. మొత్తం జీహెచ్ఎంసీకి ఐదు లక్షల చీరలు వచ్చాయని అధికారులు తెలిపారు.
ఈనెల 21 నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందే చీరల పంపిణీ జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన మాదిరికాకుండా ఈసారి రూ.800 ఖరీదు చేసే చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ప్రతీ చీరకు ప్రత్యేకంగా ఓ కవర్లో అందించనున్నారు. అయితే, బతుకమ్మ పండుగకు ముందుగా ఒక చీర పంపిణీ చేస్తుండగా.. సంక్రాంతికి కూడా మరో చీర అందించనున్నట్లు తెలిసింది.