పిల్లలతో కలసి సినిమాకి వెళ్తున్నారా..? తెలంగాణ హైకోర్టు కొత్త ఆర్డర్స్.. ఇకపై..

పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే సమయంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

పిల్లలతో కలసి సినిమాకి వెళ్తున్నారా..? తెలంగాణ హైకోర్టు కొత్త ఆర్డర్స్.. ఇకపై..

Cinema Theater

Updated On : January 28, 2025 / 10:22 AM IST

Cinema Theaters: చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు థియేటర్లకు వెళ్లి సినిమాలను చూడటం ఇష్టపడుతుంటారు. పెద్ద స్క్రీన్ పై అరుపులు, కేకల మధ్య సినిమా చూస్తే వచ్చే మజానే వేరు. దీంతో చాలామంది వారు అభిమానించే హీరో సినిమా వచ్చిదంటే మొదటిరోజు వెళ్లి చూసేందుకు ఆసక్తిచూపుతుంటారు. మరికొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు మారం చేయడంతో వారిని తీసుకొని సినిమాకు వెళ్తుంటారు. ఈ క్రమంలో థియేటర్ల వద్ద రద్దీ మధ్య పిల్లలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కోసారి తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి తరహా ఘటనే పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా చోటు చేసుకుంది. దీనికితోడు ఎప్పుడుపడితే అప్పుడు మైనర్లను థియేటర్లలోకి అనుమతి ఇవ్వడం ద్వారా వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఇకమీదట సెకండ్ షో, ఫస్ట్ షో సినిమాలకు వెళ్లే పిల్లలకు ఏజ్ లిమిట్ పెట్టింది.

Also Read: అమెరికాలో ట్రంప్ వేట.. గుడి, బడి అని లేదు.. ఇండియన్స్ ఉండే రాష్ట్రాల్లో.. గురుద్వారాల్లో కూడా..

సినిమా థియేటర్లలో ఎప్పుడుపడితే అప్పుడు షో వేయడం, మైనర్లను కూడా వేళాపాళా లేకుండా అనుమతించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరలను పెంపు, అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి విచారించారు. పిటిషన్ల తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. సినిమాటోగ్రఫీ రూల్స్ ప్రకారం ఉదయం 8.40 గంటలలోపు, అర్ధరాత్రి 1.30 గంటల తరువాత సినిమాలను ప్రదర్శించరాదు. ముఖ్యంగా మైనర్లను అనుమతించరాదు. అయితే, మల్లీప్లెక్స్ లలో చివరి షో తెల్లవారుజామున 1.30 గంటల వరకు ఉంటుంది. ఇలా అర్ధరాత్రి దాటిన తరువాత నిబంధనలకు విరుద్దంగా థియేటర్లలో షోలు ప్రదర్శించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి థియేటర్లకు వెళ్లే మైనర్ల శారీరక, మానసిక ఆరోగ్యం ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి విపరీతంగా జనాలు వస్తుండటంతో తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు.. ఇటీవల పుష్ప-2 సందర్భంగా జరిగిన తొక్కిసలాట విషయాన్ని న్యాయవాది ప్రస్తావించాడు.

Also Read: Gossip Garage : పదేళ్లు నేనే సీఎం..! ముఖ్యమంత్రి సీటుపై రేవంత్‌రెడ్డిది కాన్ఫిడెన్సా? స్ట్రాటజీనా?

పిటిషన్ల తరపు న్యాయవాది వాదనలకు ఏకీభవిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 16ఏళ్లలోపు పిల్లలను వేళాపాళా లేకుండా థియేటర్లలోకి అనుమతించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి ఉదయం 11గంటలలోపు, రాత్రి 11గంటల తరువాత 16ఏండ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని, అన్నివర్గాలతో చర్చలు జరిపి చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

 

ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకునే వరకు.. ఉదయం 11గంటలలోపు, రాత్రి 11గంటల తరువాత 16ఏండ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదంటూ ప్రతివాదులైన హోంశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22వ తేదీకి వాయిదా వేసింది.