తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీపై కసరత్తు పూర్తి చేసింది. ప్రస్తుతమున్న మద్యం పాలసీ సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం రెండ్రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన ఆధాయ వనరైన మద్యం అమ్మకాలను పెంచుకోవడం ద్వారా మరింత రాబడి రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుత పాలసీ ముగియడానికి ఇంకో 13 రోజులే ఉండగా, ప్రభుత్వం ఇప్పటికీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో వ్యాపారుల్లో కొత్త పాలసీ ఎలా ఉంటుందోననే ఉత్కంఠ మొదలైంది.
రాబోయే కొత్త పాలసీ విధానం ద్వారా మద్యం దుకాణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా ప్రభుత్వ ఆధాయం పెరగడం ఖాయం. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 212 వైన్ షాపులు, 225 బార్లు ఉండగా… రంగారెడ్డి జిల్లాలో 412 వైన్స్, 405 బార్లు ఉన్నాయి. 2017–19లో శివార్లలోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఫీజును ఏడాదికి రూ.45 లక్షలుగా నిర్ణయించారు.
ఇటీవల శివార్లలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు ఏర్పడటంతో దుకాణాల సంఖ్య పెరిగి లైసెన్స్ ఫీజు కూడా భారీగా పెరిగే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. 2017–19లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని దుకాణాలకు ఏడాదికి లైసెన్స్ ఫీజు రెండేళ్లకు రూ.2.16 కోట్లు వసూలు చేశారు.