Telangana : పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజల కలకలం..పాండవుల గుట్టలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

గుప్తనిధుల వేటగాళ్ల కన్ను ఓ చారిత్రాత్మక గుట్టపై పడింది. ఆ గుట్ట కింద కోట్లు విలువ చేసే సంపద ఉందంటూ ప్రచారం జరుగుతోంది. లంకె బిందెలు.. బంగారు నాణేలు ఉన్నాయంటూ పుకార్లు షికారు చేస్తుండటంతో.. గుట్టపై తవ్వకాలు మొదలుపెట్టారు కేటుగాళ్లు. గుప్తనిధుల కోసం క్షుద్ర పూజాలు చేస్తుండటంతో.. గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. నిజంగా గుట్ట కింద బంగారు గని ఉందా..?

Telangana : పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజల కలకలం..పాండవుల గుట్టలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

Occult Worship In Pandavula Gutta Peddapalli District

Updated On : May 30, 2022 / 5:03 PM IST

occult worship in pandavula gutta peddapalli district : గుప్తనిధుల వేటగాళ్ల కన్ను ఓ చారిత్రాత్మక గుట్టపై పడింది. ఆ గుట్ట కింద కోట్లు విలువ చేసే సంపద ఉందంటూ ప్రచారం జరుగుతోంది. లంకె బిందెలు.. బంగారు నాణేలు ఉన్నాయంటూ పుకార్లు షికారు చేస్తుండటంతో.. గుట్టపై తవ్వకాలు మొదలుపెట్టారు కేటుగాళ్లు. గుప్తనిధుల కోసం క్షుద్ర పూజాలు చేస్తుండటంతో.. గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. నిజంగా గుట్ట కింద బంగారు గని ఉందా..? ఇంతకీ ఆ బంగారు గుట్ట ఎక్కడుంది..?

రాజులు, రాజ్యాలు చరిత్రలో మిగిలిపోయాయి. అయితే రాజులు దాచి పెట్టిన బంగారం, నగలు గుట్టల్లో ఉన్నాయనేది చాల మంది అనుమానం. వీటి కోసం గుప్త నిధుల వేటగాళ్లు, మంత్రగాళ్ల సాయంతో తవ్వకాలు జరుపుతుంటారు. గుప్త నిధుల వేటలో పడి ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో గుప్తనిధుల కలకలం మొదలైంది. చారిత్రత్మక గుట్టగా పేరుగాంచిన పాండవుల గుట్టలో లంకె బిందెలు.. బంగారు నాణేలు ఉన్నాయంటూ గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరపడం కలకలం రేపుతోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చాలా ఏళ్ల చరిత్ర ఉంది. ఈ గ్రామం చుట్టు ఎత్తైన కొండలున్నాయి. ప్రకృతి రమణీయతతో మనస్సు దోచుకుంటున్న ఈ ప్రాంతంలోనే పాండవుల గుట్ట ఉంది. ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, కాకతీయ రాజులు పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. వనవాస కాలంలో పాండవులు ఈ ప్రాంతంలో సంచరించినట్లుగా తెలుస్తుండగా.. ఇక్కడ లభించిన ఆధారాలతో ఈ గుట్టను పాండవుల గుట్టగా పిలుస్తున్నారు స్థానికులు. అయితే.. ఇది గుట్ట కాదని.. బంగారు గని అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ గుట్ట కింద బంగారు సంపద దాచి పెట్టినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో.. బంగారు నాణేల కోసం ఇక్కడ వేట కొనసాగుతుంది.

పాండవుల గుట్ట ప్రాంతంలో.. గతంలో బంగారు నాణేలు లభించినట్లు చెబుతున్నారు తొగర్రాయి గ్రామస్తులు. గుట్ట కింద బంగారం దాచిపెట్టినట్లు ప్రచారం జరుగుతోందంటున్నారు. నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని.. దేవతా విగ్రహాలను సైతం ఎత్తుకెళ్లారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాండవుల గుట్ట కింద నిధులున్నాయంటూ చాలా కాలంగానే ప్రచారం జరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి క్షుద్రపూజలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇంతకీ పాండవుల గుట్ట కింద బంగారు నిధులు, నిక్షేపాలు ఉన్నాయా..?

పాండవుల గుట్టపై బంగారు నిధులు ఉన్నాయనే ప్రచారంతో.. గుప్తనిధుల వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. గతంలోనూ ఇక్కడ బంగారు నాణేలు దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. క్షుద్రపూజలు చేసి వాటిని ఇక్కడి నుంచి తరలించుకుపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తొగర్రాయి గ్రామస్తులు. గతంలో కూడా కొంతమంది గుప్తనిధుల కోసం తవ్వకాలు చేశారు. గుట్టపై ఏకంగా.. జేసీబీతో తవ్వకాలు చేస్తుండగా.. మంటలు చెలరేగి జేసీబీ కాలిపోయింది. జేసీబీతో పాటు డ్రైవర్ కూడా కాలిపోయాడన్న ప్రచారం జరిగింది. క్షుద్రపూజలు, తవ్వకాలతో పాండవుల గుట్ట వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు సమీప గ్రామాల ప్రజలు.

పాండవుల గుట్టపై క్షుద్ర పూజలు జరుగుతున్నట్లు చాలా క్లియర్‌గా తెలుస్తోంది. గుప్తనిధుల కోసం కొండను నామరూపాలు లేకుండా తవ్వేస్తున్నారు కేటుగాళ్లు. జంతుబలి.. నరబలి వంటి ఘటనలు జరిగే అవకాశాలుండడంతో.. గుట్ట వైపు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పాండవుల గుట్టపై ఎవరికైనా నిధులు దొరికాయా..? దొరికితే ఆ నిధులను ఏం చేశారు..?

దుండగుల చర్యలతో చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. నిధుల పేరుతో గుట్టను నాశనం చేస్తున్నాయి గుప్తనిధుల ముఠాలు. దేవతా విగ్రహాలను సైతం మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. అయితే.. విగ్రహాల అపహరణపై పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టలేదు. అటు గ్రామస్తులు సైతం ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో.. ప్రాచీన సంపద కనుమరుగువుతోంది. చరిత్ర కాలగర్భంలో కలసిపోతోంది. చూడాలి.. ఇప్పటికైనా పోలీసులు ఈ విషయంపై స్పందిస్తారో లేదో మరి.