Telangana SSC Results
Telangana 10th Result: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఇవాళ మధ్యాహ్నం 1గంట సమయంలో రవీంద్రభారతి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే, ఫలితాల ప్రక్రియ ఆలస్యం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం 1గంటకు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి.
ఏప్రిల్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 శిబిరాల్లో స్పాట్ వాల్యుయేషన్ జరిగింది. ఈ ప్రక్రియ వారంరోజుల క్రితమే పూర్తయింది. పలు దఫాలుగా వెరిఫికేషన్ ప్రక్రియనుసైతం విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. అయితే, ఫలితాలు ఎలా విడుదల చేయాలనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం ఎస్ఎస్సీ బోర్డు అధికారులు వెయిట్ చేశారు. మూడ్రోజుల క్రితం దీనిపై స్పష్టత రావడంతో బుధవారం ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈసారి ఫలితాల్లో గ్రేడ్లకు బదులు మార్కులు ఇవ్వనున్నారు. అయితే, సబ్జెక్టులకు మాత్రమే మార్కులు, గ్రేడ్లు ఇవ్వనుండగా.. ఓవరాల్ ఫలితాలను మాత్రం కేవలం మార్కుల వరకే పరిమితం చేయనున్నారు. కో కరికులమ్ యాక్టివిటీస్ లో కేవలం గ్రేడింగ్ మాత్రమే ప్రకటిస్తారు.
ఫలితాల వెల్లడి అనంతరం 10tv వెబ్‌సైట్ తోపాటు అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లలోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.