Akshaya Tritiya 2025 : అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు జరుపుకుంటారు, కచ్చితంగా గోల్డ్ కొనాల్సిందేనా?
అక్షయ తృతీయను అక్తి, అకా తీజ్ అని కూడా పిలుస్తారు.

Akshaya Tritiya 2025 : రేపే(ఏప్రిల్ 30) అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే ఏంటి? దాని విశిష్టత, ప్రాముఖ్యత ఏంటి? అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటారు? ఇప్పుడు తెలుసుకుందాం..
అక్షయ తృతీయ అనగానే బంగారం షాపులకు క్యూ కట్టడం, కనీసం గ్రాము గోల్డ్ అయినా కొనుగోలు చేయడం.. ఇదే చాలామంది అనుకుంటారు. కానీ, అక్షయ తృతీయకు చారిత్రక, పురాణాల విశిష్టత ఎంతో ఉంది. హిందువులు అక్షయ తృతీయను పవిత్రమైన రోజుగా భావిస్తారు. జైన సంప్రదాయంలోనూ అక్షయ తృతీయకు ప్రాధాన్యత ఉంది.
అక్షయ తృతీయను అక్తి, అకా తీజ్ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుద్ధ శుక్ల పక్షంలో అక్షయ తృతీయ వస్తుంది. ఈరోజున ఏ పని ప్రారంభించినా దిగ్విజయం అవుతుందని ఒక నమ్మకం. అక్షయ తృతీయ రోజునే చాలామంది వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. స్థలాల కొనుగోలు, వ్యాపారాలు, బంగారం కొనుగోలు ఇలా ముఖ్యమైన పనులను అక్షయ తృతీయ రోజున మొదలుపెట్టడం సంప్రదాయంగా వస్తోంది.
అక్షయ తృతీయ రోజున కనీసం పిసరంత బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో సిరి సంపదలు తులతూగుతాయని నమ్మకం ముందు నుంచి వస్తోంది. అక్షయ అంటే క్షయం లేనిది.. అంటే నాశనం లేనిది. తృతీయ అంటే మూడో రోజు.
వైశాఖ శుక్ల పక్షాన మూడో రోజున వస్తుంది కాబట్టే దీన్ని అక్షయ తృతీయ అన్నారు. శుక్ల పక్షం వృద్ధికి శుభకరంగా భావిస్తారు. కాబట్టి ఈ శుక్లపక్షం తదియను తృతీయ పిలుస్తారు. పురాణాల ప్రకారం అక్షయ తృతీయకు చాలా ప్రాధాన్యతే ఉంది. నాలుగు యుగాల్లో ముఖ్యమైన త్రేతాయుగం ఈరోజునే ప్రారంభమైందని చెబుతారు.
Also Read: అక్షయ తృతీయకు, అక్షయ పాత్రకు సంబంధమేంటి?
మహావిష్ణువు, పరశరాముడు జన్మించిన శుభ తిథిగా పిలుస్తారు. వేద వ్యాసుడు గణపతి సాయంతో మహాభారతాన్ని మొదలు పెట్టింది కూడా అక్షయ తృతీయ నాడే. శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడు సుధామను కలుసుకున్న రోజు. భగీరథుడి ప్రయత్నంతో గంగమ్మ భూమిపై ప్రవహించడం మొదలు పెట్టిన సమయం ఇది.
పాండవులు వనవాసంలో ఉండగా ద్రౌపదికి అక్షయపాత్ర సిద్ధించిన రోజుగా కూడా చెప్పారు. అక్షయ పాత్ర అంటే తరగని ఆహారాన్ని అందించేంది. కోరుకున్న వస్తువులను అనుగ్రహించే పాత్ర. అక్షయ తృతీయ రోజున పుణ్య తీర్ధాల సందర్శన, పుణ్య స్నానాలు చేయడం, ఉపావాసాలు ఉండటం అనాదిగా వస్తున్న ఆచారం.
గణపతి, శ్రీ మహాలక్ష్మి, మహా విష్ణువు, కుబేరుడు.. ఇలా పలు దేవతా మూర్తులను ఈరోజు ఆరాధిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి లాంటి విలువైన లోహాలు, వజ్రాలు, నవ రత్నాలని ఆయా రాశుల వారు కొనుగోలు చేయడం వల్ల వారి జీవితాల్లో మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. వివాహాది శుభకార్యాలకు అక్షయ తృతీయ దివ్యమైన రోజుగా చెప్తారు. ఈ విశిష్టమైన రోజున శుభకార్యాలను, శుభప్రదమైన పనులకు శ్రీకారం చుట్టాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం, విలువైన వస్తువులను కొనుగోలు చేసే ఆచారం ఉంది.
అక్షయ తృతీయకు బంగారాన్ని ఎక్కువగా ఎందుకు కొంటారు? ఇది చాలామందికి వచ్చే సందేహం. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు అనేది శుభసూచికంగా అంతా భావిస్తారు. కానీ, కచ్చితంగా అందరూ బంగారం మాత్రమే కొనాలి అనే రూల్ ఏమీ లేదు. తాహతుకు తగ్గట్టుగా శుభసూచకంగా ఉండేలా కొత్త పనులను ప్రారంభించడం, లోహాలు ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయటం మంచిదని ఒక నమ్మకం. ఇందులో భాగంగా గోల్డ్ కోనుగోలు చేస్తుంటారు.
Also Read: అక్షయ తృతీయ రోజున బంగారమే ఎందుకు కొనాలి..? పసిడి కొంటే ఇక అంతా లాభమేనా?
ఇక బంగారాన్నే ఎందుకు కొంటారు అంటే.. పసిడిని భారతీయులు లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారు. శుభకరంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున ఇష్ట దైవారాధన చేసి పూజల్లో బంగారాన్ని కూడా పెడుతుంటారు. పైగా అక్షయ తృతీయ రోజు అత్యంత శుభప్రదమైన ముహూర్తంలో ఇలాంటివి కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో శుభాలు, ఐశ్వర్య వృద్ధి జరుగుతుందని నమ్ముతారు. పెట్టుబడులు, కొనుగోళ్లకు దీన్ని మంచి రోజుగా భావిస్తారు కాబట్టి జువెలరీ షాపుల్లో అక్షయ తృతీయ రోజున రద్దీ ఎక్కువగా ఉంటుంది.
గోల్డ్ ఒక ఆర్థిక పెట్టుబడిగా భారతీయులు భావిస్తారు. అలంకరణతో పాటు కుటుంబానికి అత్యవసర సమయాల్లో ఆదుకునే, ఉపయోగ పడే వస్తువు కింద గోల్డ్ ను చూస్తారు. మిగతా రోజుల్లో కూడా పుత్తడి కొనుగోళ్లు ఉంటాయి. కాకపోతే అక్షయ తృతీయ చాలామంచి రోజు అన్న భావనతో బంగారు నగలు, నాణెలు, బిస్కెట్లు ఇలా తోచినంత గోల్డ్ కొనుగోలు చేస్తుంటారు. అందుకే మిగతా రోజులతో పోలిస్తే బంగారం కొనుగోళ్లు అక్షత తృతీయ రోజు ఎక్కువగా ఉంటాయి.
అక్షయ తృతీయ నాడు ప్రజలు ఒకరోజు ఉపవాసం ఉంటారు. పూజలు చేసి విష్ణువుకు సమర్పించడానికి “అక్షతలు” (పసుపు కుంకుమ పూసిన విరిగిన బియ్యం) తయారు చేస్తారు. కుబేరుడిని పూజించడం కూడా ఒక శుభప్రదమైన ఆచారంగా భావిస్తారు. అక్షయ తృతీయ శుభప్రదమైన రోజు కాబట్టి, విలువైన లోహాలను కొనడం వల్ల కుటుంబానికి శ్రేయస్సు అదృష్టం లభిస్తుందని నమ్ముతారు. అందుకే చాలామంది బంగారం లేదా వెండి వస్తువులను కొనడానికి ఇష్టపడతారు. ఈరోజు వివాహాలకు కూడా శుభప్రదం. అంతేకాకుండా, ఈరోజున దానధర్మాలు చేయడం ముఖ్య ఘట్టం. ఆ విష్ణువు ఆశీస్సులు పొందడానికి పేదలకు ధాన్యాలు, వస్త్రాలు, ఇతర వస్తువులను దానం చేస్తారు.