10th Exams: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అలాఅని, నిర్లక్ష్యం చేయొద్దు..
తెలంగాణలో ఈనెల 21వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

SSC Exam
10th Exams Telangana: తెలంగాణలో ఈనెల 21వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో బాలురు 2,58,895 మందికాగా.. బాలికలు 2,50,508 మంది ఉన్నారు. వీరు పరీక్షలు రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.
తెలంగాణలో 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణా రావు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్ కోర్సు) పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు జరగనుండగా.. సైన్స్ సబ్జెక్టులకు ఫిజికల్, బయోలజీ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తామని వివరించారు. పరీక్షల నిర్వహణలో భాగంగా 2,650 మంది సీఎస్ లు, డీవోలను, 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
విద్యార్థులు వారి హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చునని కృష్ణారావు తెలిపారు. హాల్ టికెట్లను డీఈవోల ద్వారా పాఠశాలలకు పంపించామని, ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులు హాల్ టికెట్లు పొందాలని తెలిపారు. వివిధ కారణాలతో పాఠశాలల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే విద్యార్థులు వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరుకావచ్చునని పేర్కొన్నారు.
గతంలో పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యం వచ్చినా అనుమతించేవారు కాదు. అయితే, ఈసారి నుంచి విద్యార్థులకు కొంత వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్ష నిర్ణీత సమయం కంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. దీంతో విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్లినా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అయితే, విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆలస్యంగా పరీక్షా కేంద్రానికివెళ్లి ఇబ్బంది పడటంకంటే.. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుంటే టెన్షన్ లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయవచ్చునని అధికారులు సూచిస్తున్నారు.
ఏప్రిల్ 4న పరీక్షలు ముగిసిన తర్వాత, ఏప్రిల్ 7వ తేదీ నుండి 15 వరకు 19 మూల్యాంకన శిబిరాలలో సమాధాన పత్రాల స్పాట్ మూల్యాంకనం జరుగుతుంది. మూల్యాంకనం కోసం కేటాయించిన అన్ని విభాగాల అధికారులు మార్చి 24న బార్‌కోడింగ్, సమాధాన పత్రాల కోడింగ్‌పై ఓరియంటేషన్ పొందుతారు.