Student Letter To CM Revanth : “సీఎం సార్.. అమ్మాయిలే వంట చేయాలా.. ఇంకెన్నాళ్లిలా..” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ఇంటర్ విద్యార్థిని
Student Letter To CM Revanth : 2026 కాలంలో కూడా అమ్మాయిలే వంట చేయాలి.. అబ్బాయిలు కెరీర్ ని నిర్మించుకోవాలా.. ఇంక మారరా.. ఎన్నాళ్లిలా అంటూ ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిందో విద్యార్థిని.
telangana student questions gender stereotypes in intermediate english exam paper and write letter to cm revanth reddy
- ఇంటర్ ఇంగ్లీష్ పరీక్ష పేపర్లో లింగ వివక్షకు తావిచ్చేలా ప్రశ్నలు
- అమ్మాయిలకేమో వంట.. అబ్బాయిలకేమో కెరీరా?
- ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఇంటర్ విద్యార్థిని
Student Letter To CM Revanth : రాకెట్లో చంద్రమండలం మీదకు వెళ్లే రోజులు వచ్చినా సరే.. మన సమాజంలో మాత్రం లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. పూర్వంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుపడ్డా.. స్త్రీ, పురుష సమానత్వం పూర్తి స్థాయిలో రాలేదనేది చేదు వాస్తవం. కనీసం నేటి తరం పౌరులకైనా ఈ సమానత్వం గురించి బోధించి.. ఆచరించే దిశగా తీసుకెళ్తారా అంటే లేదనే సమాధానమే వినిపించడం కాదు కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి తాజాగా జరిగిన ఇంటర్ బోర్డు ఇంగ్లీష్ పరీక్షలో అడిగిన ప్రశ్నలు. వీటిని చూస్తే సమానత్వాన్ని బోధించాల్సిన పుస్తకాల్లోనే వివక్షను ప్రోత్సహిస్తుంటే.. ఇక సమాజంలో మార్పు ఎప్పుడు రావాలి? ఏంటి సీఎం సార్.. అమ్మాయిలు అంటే నేటికీ కూడా వంటింటి కుందేళ్లేనా.. వంట ఆడవారి పనేనా.. మగపిల్లలకు మాత్రమే భవిష్యత్తు, కెరీర్ గురించి కలలు కనే అధికారం ఉందా అని ప్రశ్నిస్తూ.. మహిమా కీర్తన అనే ఇంటర్ సెకండియర్ విద్యార్థిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం సంచలనంగా మారింది. ఇంటర్ బోర్డు తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
తాజాగా తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షలో డైలాగ్ రైటింగ్ భాగంలో ఇచ్చిన ప్రశ్నలు వివాదానికి కారణమయ్యాయి. ఈ పరీక్షలో అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి.. కుమార్తెకు వంట నేర్పించాలనుకునే తల్లికి, కూతురికి మధ్య జరిగే సంభాషణ గురించి రాయండి. ఇదే ప్రశ్నలో మరో ఆప్షన్ కింద కొడుకు భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగే తండ్రికి, కుమారుడికి మధ్య జరిగే సంభాషణ గురించి రాయమని ప్రశ్నించారు.
పాఠ్య పుస్తకాల్లోనే అనుకుంటే.. ఆఖరికి ఇదే అంశంపై పరీక్షలో ప్రశ్నలు రావడంపై ఇంటర్ సెకండియర్ విద్యార్థిని కీర్తన ఆశ్చర్యపోయింది. ఈ లింగ వివక్ష గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే లేఖ రాయడం సంచలనంగా నిలిచింది. తన లేఖలో కీర్తన పలు అంశాలను ప్రస్తావించింది. వంట అంటే కేవలం ఆడవారికి మాత్రమే సంబంధించిన పని కాదు. ఆడ, మగ ఇద్దరికీ తెలిసి ఉండాల్సిన కనీస నైపుణ్యం. అలాంటిది.. దాన్ని కేవలం ఆడపిల్లలకే పరిమితం చేస్తూ.. అబ్బాయిలు అంటే వారికే కెరీర్ ఉండాలనేలా ప్రశ్నలు అడగడం సరైన పద్ధతేనా? 2026 కాలంలో కూడా ఇలాంటి భావజాలం ఇంకా కొనసాగడం.. సమాజ వైఫల్యమా.. విద్యా వ్యవస్థ వైఫల్యమా అంటూ ఆమె ప్రశ్నించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.
ఇదిలా ఉంటే మహిమా కీర్తన.. కాచిగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతోంది. పైగా తాను ఒక జాతీయ స్థాయి రైఫిల్ షూటర్. 2023లో తెలంగాణ రాష్ట్ర ఎస్జీఎఫ్ఐ (SGFI) ఛాంపియన్‌గా నిలిచింది. లేఖలో తన గురించి ఈ విషయాలను ప్రస్తావిస్తూ… దేశంలోనే నల్సార్ (NALSAR) లో తనకు సీటు వచ్చిందని తెలిపింది. ఒక షూటర్‌గా, కాబోయే న్యాయవాదిగా తన భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నానని చెప్పుకొచ్చింది. తమ ఇంట్లో తన తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వంట చేస్తారని తెలిపింది. సమాజంలో మార్పు రావాలని కోరుకునే విద్యావ్యవస్థ ఇలాంటి ప్రశ్నలతో విద్యార్థులను వెనక్కి నెట్టడం విచారకరమని కీర్తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సిలబస్‌ను తొలగించి.. కనీసం పుస్తకాల్లో అయినా లింగ వివక్షకు తావు లేకుండా చూడాలని కోరింది. కీర్తన రాసిన లేఖపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. మరి ఈ లేఖపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.
