చెక్ చేసుకోండి : తెల్లరేషన్ కార్డు దారుల బ్యాంకు అకౌంట్లో రూ. 1500

  • Publish Date - April 14, 2020 / 12:22 AM IST

తెలంగాణ రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు దారులకు ఇచ్చిన హామీని పూర్తి చేసేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమైంది. కరోనా రాకాసి మూలంగా పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 12 కేజీల బియ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.

అంతేగాకుండా వారి వారి బ్యాంకు అకౌంట్లలో రూ. 1500 జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు డబ్బులు జమ చేయలేదు. డబ్బులు ఎలా జమ చేయాలనే దానిపై ప్రభుత్వం సుదీర్ఘంగా కసరత్తు జరిపింది. (రాష్ట్రంలో 20 వేల వైఎస్సార్ జనతా బజార్లు )

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 1500 ఇస్తామని, 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం వారి వారి బ్యాంకు అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని మంత్రి KTR వెల్లడించారు. ఇప్పటికే రూ. 1,112 కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు బదిలీ చేసిందని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారాయన. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1.03 కోట్ల కుటుంబాలు ఉన్నాయని అంచనా. ఇందులో 87.59 లక్ష మంది తెల్లరేషన్ కార్డు దారులున్నట్లు సమాచారం. 

మరోవైపు కరోనా మహమ్మారి రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తోంది. 2020, ఏప్రిల్ 13వ తేదీ సోమవారం సాయంత్రం వరకు 61 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 592కు చేరుకున్నట్లైంది. హైదరాబాద్ లో 267 కేసులు నిర్ధారించారు. మృతుల సంఖ్య 17కు చేరుకుంది.