Telangana Haritha Haram : గ్రీన్‌ తెలంగాణ.. ఏడో విడత హరితహారం

తెలంగాణలో నేటి (గురువారం) నుంచి హరితహారం ప్రారంభం కానుంది. ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతోంది ప్రభుత్వం. ఈ సారి ఏకంగా 20 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యం నిర్ధేశించుకుంది అటవీశాఖ.

Telangana Haritha Haram : గ్రీన్‌ తెలంగాణ.. ఏడో విడత హరితహారం

Telangna 7th Haritha Haram To Be Started From Today

Updated On : July 1, 2021 / 6:49 AM IST

Telangna 7th Haritha Haram : తెలంగాణలో నేటి (గురువారం) నుంచి హరితహారం ప్రారంభం కానుంది. ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతోంది ప్రభుత్వం. ఈ సారి ఏకంగా 20 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యం నిర్ధేశించుకుంది అటవీశాఖ. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 వేల 241 నర్సరీలలో 25 కోట్ల మొక్కలను అందుబాటులో ఉంచారు. ఒక్కో ఇంటికి ఆరు మొక్కలు నాటే లక్ష్యంతో ఏడో విడత హరితహారం మొదలవుతోంది. తెలంగాణ ఏర్పాటయ్యాక 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌.. 2015లో హరితహారం చేపట్టారు. 230 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్.

ఏడో విడత హరితహారంలో భాగంగా.. ఈసారి బహుళ రహదారి వనాలకు ప్రాధాన్యత ఇస్తోంది. జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పంచాయితీ రోడ్ల వెంబడి బహుళవనాల కోసం మొక్కలు నాటనున్నారు. యాదాద్రి మోడల్‌లో ప్రతి చోట మొక్కలు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ అంతటా..ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటనున్నారు. ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయడమే కాదు…వాటిని పెంచే బాధ్యత సైతం ఆయా కుటుంబాలకు అప్పగించనున్నారు అధికారులు. నేటి నుంచి 10వ తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై రాష్ట్ర మంతటా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ప్రతీ ప్రాంతంలో అటవీ భూముల గుర్తింపు, అటవీ పునరుద్దరణకు చర్యలు చేపట్టడంతో పాటు, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో బ్లాకుల వారీగా అటవీ పునరుద్దరణ ప్రణాళికలు సిద్ధం చేశారు.

పటిష్ట చర్యలు, పర్యవేక్షణ ద్వారా అటవీ భూములు, సంపద రక్షణ చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 32 కోట్ల రూపాయల గ్రీన్ బడ్జెట్ నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ప్రతీ విద్యా సంస్థ, ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల ఖాళీ స్థలాల్లో ఖచ్చితంగా పచ్చదనం పెంచేందుకు చర్యలు చేపట్టనున్నారు. ప్రతీ మండల కేంద్రంతో పాటు, పట్టణ ప్రాంతాలకు సమీపంలో పెద్దపెద్ద ప్రకృతి వనాలను ఏర్పాటుచేయనున్నారు. హరితహారంలో భాగంగా..నాటే మొక్కల్లో ఖచ్చితంగా 85 శాతం బతికేలా పంచాయతీ రాజ్ చట్టం అమలుకు నిర్ణయం తీసుకుంది. అన్ని స్థాయిల్లో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. గత ఆరు విడతల్లో మొత్తం 220 కోట్ల మొక్కలు నాటారు.

అడవుల బయట 159 కోట్లకు పైగా మొక్కలు నాటితే.., అడవుల లోపల 60 కోట్ల మొక్కలు నాటారు. ఇంతవరకు హరితహారం కోసం 5 వేల 591 కోట్లు చేసింది ఆటవీ శాఖ. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక 2019 ప్రకారం రాష్ట్రంలో 3.67 శాతం పచ్చదనం పెరిగిందని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. హరితహారంలో భాగంగా తెలంగాణలో 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ది చేశారు. ఇప్పటికే పూర్తయిన 35 పార్కులు…ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 18 రెడీగా ఉన్నాయి. మిగతా 56 అర్బన్ ఫారెస్ట్ పార్కులను రానున్న ఏడాదిలో పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది అటవీ శాఖ. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణను పరిశీలించేందుకు జిల్లాల కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు.