ENG vs SA : టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ల విధ్వంసం.. సఫారీ బౌలర్లను పొట్టుపొట్టు కొట్టారు.. 39బంతుల్లోనే శతకం.. 300దాటిన స్కోర్..

ENG vs SA 2nd T20 Match : ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 304 పరుగులు చేసింది.

ENG vs SA : టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ల విధ్వంసం.. సఫారీ బౌలర్లను పొట్టుపొట్టు కొట్టారు.. 39బంతుల్లోనే శతకం.. 300దాటిన స్కోర్..

ENG vs SA 2nd T20 Match

Updated On : September 13, 2025 / 8:09 AM IST

ENG vs SA 2nd T20 Match : ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లు మైదానంలో విధ్వంసం సృష్టించారు. టీ20 మ్యాచ్‌లో సఫారీ బౌలర్లను పొట్టుపొట్టు కొట్టారు. సిక్సులు, ఫోర్లతో బౌండరీల మోత మోగించారు. దీంతో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆ జట్టు 304 పరుగులు చేసింది. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికా జట్టుపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

Also Read: Bronco Test : బ్రాంకో టెస్టును పూర్తి చేసిన టీమ్ఇండియా ఆట‌గాళ్లు.. వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ

ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఓల్డ్‌ట్రాఫోర్డ్‌లో శుక్రవారం రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు సరికొత్త రికార్డును నమోదు చేసింది. తొలుత ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఆ జట్టు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ సిక్సులు, ఫోర్లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో సాల్ట్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మ్యాచ్ ముగిసే సమయానికి 60 బంతుల్లో 141 (నాటౌట్) పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సిక్సులు, 15 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు.. జోస్ బట్లర్ ఏడు సిక్సులు, ఎనిమిది ఫోర్లతో 30బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 47 బంతుల్లోనే 126 పరుగులు రాబట్టారు. ఆ తరువాత బెతెల్ (26), బ్రకూక్ (41) రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 304 పరుగులు చేసింది.


భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా 16.1 ఓవర్లలో 158 పరుగులకు ఆ జట్టు ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు పై 146 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. టీ20ల్లో ఇంగ్లాండ్ జట్టుకు (146 పరుగులు) ఇది అతిపెద్ద విజయం.

అయితే, టీ20ల్లో ఇంగ్లాండ్ జట్టు చేసిన 304 పరుగులు మూడో అత్యధిక స్కోరు. గత ఏడాది జింబాబ్వే జట్టు గాంబియాపై 344/4తో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2023లో నేపాల్ జట్టు మంగోలియాపై 314/3తో రెండో స్థానంలో ఉంది. భారత జట్టు నాల్గో స్థానంలో ఉంది. ఇదిలాఉంటే.. రెండు టెస్ట్ దేశాల మధ్య జరిగిన టీ20 చరిత్రలో ఒక జట్టు 300 పరుగుల మార్కును దాటడం ఇదే తొలిసారి. 2024లో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై 297/6తో భారత్ గతంలో అత్యధిక స్కోరు నమోదు చేసింది.


♦ టీ20ల్లో ఇంగ్లాండ్ జట్టు అత్యధిక స్కోరు (304/2) ఇదే.
♦ టీ20ల్లో ఇంగ్లాండ్ జట్టు పవర్ ప్లేలో వికెట్ల కోల్పోకుండా 100 పరుగులు చేయడం ఇదే తొలిసారి.
♦ టీ20ల్లో ఇంగ్లాండ్ జట్టు తరపున అత్యధిక స్కోర్ (141 నాటౌట్) చేసిన బ్యాటర్‌గా ఫిల్ సాల్ట్ నిలిచాడు.
♦ టీ20ల్లో ఇంగ్లాండ్ జట్టుకు (146 పరుగులు) ఇది అతిపెద్ద విజయం.

ఇదిలాఉంటే.. ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 14న నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌ వేదికగా జరుగుతుంది.