Bronco Test : బ్రాంకో టెస్టును పూర్తి చేసిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ
జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలతో పాటు మిగిలిన టీమ్ఇండియా ఆటగాళ్లు బ్రాంకో (Bronco Test) టెస్టును పూర్తి చేశారు.

Team India players complete Bronco Test BCCI video release
Bronco Test : టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలతో పాటు మిగిలిన వారంతా బ్రాంకో టెస్టును పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బీసీసీఐ ఓ వీడియోను విడుదల చేసింది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియాన్ లీ రౌక్స్ బ్రోంకో టెస్టు(Bronco Test)ను ప్రవేశపట్టిన సంగతి తెలిసిందే.
బ్రాంకో టెస్టు అనేది ఒక ఫిట్‌నెస్ వ్యాయామం.. ఇందులో ఓ ఆటగాడు తొలుత 0 నుంచి మొదలుపెట్టి 60 మీటర్లు పరుగెత్తాలి, మళ్లీ వెనక్కి రావాలి. ఆ తరువాత 0 నుంచి 40 మీటర్లు, మళ్లీ 0 నుంచి 20 మీటర్లు పరుగు తీసి వెనక్కి రావాలి. ఇది మొత్తం కలిపి ఒక సెట్. అంటే 240 మీటర్లు. ఇలా మొత్తంగా ఐదు సెట్‌లు ఉంటాయి. మొత్తంగా 1200 మీటర్లను ఆరు నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిని ఎక్కువ రగ్బీ వంటి ఆటల్లో ప్లేయర్ల ఏరోబిక్, కార్టియోవాస్క్యులర్ కెపాసిటీని పెంచుకునేందుకు ఉపయోగిస్తారు.
ఆసియాకప్‌లో సెప్టెంబర్ 14న భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం మైదానంలో టీమ్ఇండియా ఆటగాళ్లు కఠిన సాధన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లకు బ్రాంకో టెస్టును నిర్వహించినట్లు తెలుస్తోంది.
View this post on Instagram
ఇక ఈ టెస్టు పై రౌక్స్ స్పందించాడు. ఈరోజు ఆటగాళ్లు బ్రాంకో టెస్టును పూర్తి చేశారన్నాడు. అయితే ఇదేమి కొత్త టెస్టు కాదన్నాడు. చాలా ఏళ్ల నుంచే వివిధ క్రీడల్లో ఉందన్నాడు. ఇదొక ఫీల్డ్ టెస్టు అని, ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా కూడా దీనిని నిర్వహించుకోవచ్చునని చెప్పాడు.
ఈ టెస్టు రెండు రకాల ఉపయోగపడుతుందన్నాడు. ఒకటి ట్రెయినింగ్ కాగా రెండోది ఆటగాళ్ల శారీరక ధృఢత్వాన్ని పరీక్షించేందుకు అని తెలిపాడు. ఇక భారత ఆటగాళ్లు అద్బుతం అని, వారి హార్డ్‌వర్క్ తననెంతో ఆకట్టుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
గతంలో తాను ఐపీఎల్ జట్లతో పని చేశానని, ఎంతో మంది ఆటగాళ్లను చూసినట్లుగా తెలిపాడు. ప్రస్తుత జట్టు తనకు కొత్తదే అయినప్పటికి గతంలో పని చేసిన అనుభవం ఉండడంతో ఇప్పుడు సులభమైందన్నాడు. పోరాట పటిమ ఉన్న జట్టుతో కలిసి ఉండటం గర్వంగా ఉందన్నాడు.