RFCL Worker Suicide : RFCL కార్మికుడు ఆత్మహత్య.. కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత
కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్ఎఫ్ సీఎల్ కార్మికుడు ముంజ హరీశ్ ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబసభ్యులు నిరాహార దీక్షకు దిగారు.

RFCL Worker Suicide : కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్ఎఫ్ సీఎల్ కార్మికుడు ముంజ హరీశ్ ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబసభ్యులు నిరాహార దీక్షకు దిగారు. మృతుడి కుటుంబానికి మద్దతుగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో దళారులు చెలుకలపల్లి సతీశ్, ఆర్ఎఫ్ సీఎల్ సబ్ కాంట్రాక్టర్లు గుంటి రాజు, గోపగాని మోహన్ గౌడ్, పాలకుర్తి టీఆర్ఎస్ నేత బొమ్మగాని తిరుపతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (RFCL) ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో జరిగిన అవినీతి వ్యవహారం ఒకరి ప్రాణాలను బలిగొంది. శంకరపట్నం మండలం అంబాలపూర్ కు చెందిన ముంజ హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన దగ్గర దళారులు 7లక్షలు తీసుకుని తాత్కాలిక ఉద్యోగం కల్పించారని హరీశ్ వాపోయాడు. నాలుగైదు నెలలు ఉద్యోగం చేసిన తర్వాత తొలగించారని ఆవేదనకు లోనైన హరీశ్.. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ శివార్లలో శవమై తేలాడు. కనీసం తన చావుతోనైనా మిగిలిన వాళ్లకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎరువుల కర్మాగారంలో కార్మికుల నియామకం పేరుతో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, అధికార పార్టీకి చెందిన కొందరు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలని ఆశ చూపి అమాయకులను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ఫ్యాక్టరీలో ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్లంతా రోడ్డెక్కారు. తమ దగ్గర డబ్బులు తీసుకొని తాత్కాలిక ఉద్యోగాలు కల్పించారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. న్యాయం జరగక్కపోవడంతో మరో దారి లేక కొందరు బాధితులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా శంకరపట్నం మండలం అంబాలపూర్ కు చెందిన హరీశ్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.