టెన్త్ పరీక్షల్లో కొడుకు పాస్ అయ్యేలా తండ్రి ప్లాన్.. పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు

కొడుకును టెన్త్ పరీక్షల్లో పాస్ చేయించేందుకు ఓ తండ్రి పక్కాప్లాన్ వేశాడు. కానీ, ప్లాన్ బెడిసికొట్టడంతో తండ్రీ, కొడుకులతోపాటు మరికొందరి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

టెన్త్ పరీక్షల్లో కొడుకు పాస్ అయ్యేలా తండ్రి ప్లాన్.. పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు

Kamareddy district police

Updated On : March 28, 2025 / 10:36 AM IST

TS SSC Exam: కొడుకును టెన్త్ పరీక్షల్లో పాస్ చేయించేందుకు ఓ తండ్రి పక్కాప్లాన్ వేశాడు. కొడుకు పరీక్షరాసే కేంద్రం బయట వేచిఉండి.. పరీక్ష కేంద్రంలో వాటర్ సప్లయ్ చేసేందుకు వెళ్లే వ్యక్తి ద్వారా తెల్ల పేపర్ ను పరీక్షరాసే కొడుకు వద్దకు పంపించాడు. ఆ పేపర్ పై ఎగ్జామ్స్ లో వచ్చిన పలు క్వశ్చన్స్ ను రాసి అదే వ్యక్తికి ఇవ్వటంతో అతడు బయటకు తీసుకొచ్చాడు. ఆ పేపర్ లోని కశ్చన్స్ కు ఆన్సర్లు రాసి కొడుక్కు చేరవేసే క్రమంలో కొందరు వ్యక్తులు ఫోటోతీసి వాట్సప్ లో సర్క్యులేట్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకిదిగి విచారణ చేయగా.. తండ్రి, కొడుకుతోపాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.

Also Read: Indiramma Illu: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు కొత్త గైడ్‌లైన్స్ వచ్చేశాయ్.. ఈ నిబంధనలు పాటించకుంటే బిల్లులకు బ్రేక్..!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంటాలి తండాకు చెందిన ఓ విద్యార్థి టెన్త్ చదువుతున్నాడు. అతనికి జుక్కల్ జడ్పీ హైస్కూల్ లో సెంటర్ పడింది. బుధవారం మ్యాథ్స్ ఎగ్జామ్ కు హాజరయ్యాడు. సెంటర్ బయట ఉన్న ఆ విద్యార్థి తండ్రి జాదవ్ సంజయ్ తన కొడుకుకు ఆన్సర్లను అందించాలని ప్లాన్ చేశాడు. ఎగ్జామ్ సెంటర్ లో వాటర్ సప్లయ్ చేసేందుకు నియమించిన సయ్యద్ ముబీన్ కు వైట్ పేపర్ ఇచ్చి తన కొడుక్కు ఇవ్వాలని సూచించాడు. అతడు వైట్ పేపర్ ను తీసుకెళ్లి కొడుక్కు ఇవ్వగా.. ఆ విద్యార్థి పేపర్లో వచ్చిన నాలుగు క్వశ్చన్స్ ను తెల్ల పేపర్ పై రాసి తిరిగి ముబీన్ కి అందజేశాడు. దీంతో ఆ పేపర్ ను తీసుకొచ్చి ఎగ్జామ్ సెంటర్ బయట ఉన్న జాదవ్ సంజయ్ కు ఇచ్చాడు.

Also Read: జ్యోతిష్యం పేరుతో మోసం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి ఏకంగా రూ.12లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. ఎలా అంటే..

జాదవ్ సంజయ్ ఆ క్వశ్చన్లను కంబాడే మనోజ్, వరప్రసాద్ అనే వ్యక్తులకు చూపించాడు. ప్రశ్నలను మనోజ్ ఫోటో తీసి మెహురి హన్మండ్లుకు పంపగా అతడు భాను అనే వ్యక్తికి, అతడు బీర్కూర్ లో ఉండే కొప్పుల గంగాధర్ కు పంపించాడు. క్వశ్చన్ల లీకేజీకి సంబంధించి గంగాధర్ ఓ వీడియోను తయారు చేసి వాట్సప్ గ్రూప్ లో పోస్టు చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఫ్లయింగ్ స్వ్వాడ్ బృందం వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విద్యాశాఖ అధికారులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకిదిగి విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

జాదవ్ సంజయ్, సయ్యద్ ముబీన్, మనోజ్, వరప్రసాద్, మెహురి హన్మండ్లు, కొప్పుల గంగాధర్ ను అరెస్టు చేయడంతో పాటు ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్ కు పంపించారు. భాను, నహీమ్ ఖాన్ అనే వ్యక్తులు పరారీలో ఉన్నారు.