హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్‌కు గుండెపోటు వచ్చింది. హైకోర్టులో కేసు వాదిస్తున్న సమయంలోనే ఆయన కుప్పకూలిపోవడం గమనార్హం. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టులో అన్ని బెంచ్ లలో విచారణలు నిలిపి వేశారు జడ్జిలు. అన్ని కోర్టుల్లో విచారణలను రేపటికి వాయిదా వేశారు.
గుండెపోటుతో మృతి చెందుతున్న కేసులు కొంత కాలంగా పెరిగిపోతున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాని ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. కొలెస్ట్రాల్ తగ్గించే ఆహార పదార్థాలు మంచివి. ట్రాన్స్ ఫ్యాట్, సాచ్యురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉన్న ఫాస్ట్ ఫుడ్ తినకూడదు. అధిక ఉప్పు, చక్కెరను ఆహార పదార్థాల్లో తగ్గించాలి.
క్రమం తప్పని వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవాలి. అధిక బరువు ఉంటే, దాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. పొగ, మద్యం తాగే అలవాటు ఉంటే మానేయాలి. పొగ తాగడం గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ధ్యానం, ప్రాణాయామం, సంగీతం వినడం వంటి మార్గాల ద్వారా ఒత్తిడిని నియంత్రించుకోవాలి. మీ రక్తపోటు, కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ గురించి క్రమం తప్పకుండా తెలుసుకోండి.