‘ధరణి’ వివాదంపై సుప్రీంకెళ్లిన తెలంగాణ ప్రభుత్వం..

Dharani portal’s controversy : ధరణి పోర్టల్ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇప్పటి వరకు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని నిన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాఫ్ట్ వేర్‌లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని ఆదేశించింది.
కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని సూచించింది. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చునని, రిజిస్ట్రేషన్ అధికారులు ఆధార్ వివరాలు మాత్రం అడగవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ కోసం ఇతర గుర్తింపు పత్రాలు అడగవచ్చునని, కానీ ఆధార్‌కు సంబంధించిన వివరాలు అడగకూడదని హైకోర్టు స్పష్టంగా వెల్లడించింది.
ఈ విషయంలో ప్రభుత్వం న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం ప్రజల సున్నితమైన సమాచారం సేకరిస్తే అంగీకరించబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపైనే తమ ఆందోళన అని హైకోర్టు తెలిపింది. దీంతో ఆధార్ వ్యవహారాలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.