Tourist Scam : బీ కేర్ ఫుల్.. యాత్రల పేరుతో ఘరానా మోసం.. ఎన్ని కోట్లు వసూలు చేశాడంటే..
తమకు న్యాయం చేయాలని, తమ డబ్బు తమకు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

Tourist Scam : హైదరాబాద్ ఉప్పల్ లో యాత్రల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్ కుమార్ పుణ్య క్షేత్రాల పేరుతో ఆఫర్స్ ప్రకటించి కోట్లలో వసూళ్లకు పాల్పడ్డాడు. మానస సరోవరం ఇతర టూర్స్ పేరిట సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేశాడు. ఐదేళ్లుగా రూ.15 కోట్లు వసూలు చేసినట్లుగా గుర్తించారు అధికారులు. దాదాపు 500 మందికిపైగా బాధితులు ఉన్నారు. బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. భరత్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.
”కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బాధితులు ఉన్నారు. అమెరికా నుంచి బాధితులు ఉన్నారు. తన అసిస్టెంట్ డబ్బులు ఎత్తుకెళ్లిపోయాడని అతడి మీద నెపం వేయాలని భరత్ కుమార్ చూశాడు. ఇంతలో అలర్ట్ అయిన అసిస్టెంట్.. మా అందరిని కలిపి ఒక గ్రూప్ చేశాడు. ఆఫీస్ నుంచి డేటా తీసుకుని వచ్చి గ్రూప్ ను ఫార్మ్ చేశాడు. అలా చేయడం వల్లే ఇంతమంది బాధితులం ఉన్నామని మాకు తెలిసింది. లేదంటే తెలిసేది కాదు. మానస సరోవరం చూడాలనే సంక్పలంతో నేను రూ.2లక్షలు ఇచ్చాను. పంపిస్తాను అని చెబుతూనే ఉన్నారు. ఇలా రెండున్నరేళ్లు గడిచిపోయాయి.
నేను ఒక్కడినే కాదు మరో 250 మంది వరకు రూ.2 లక్షల చొప్పున కట్టారు. కర్నాటక, తెలంగాణ, ఏపీలకు చెందిన వారి నుంచి డబ్బు తీసుకున్నాడు. కబుర్లు చెప్పాడు తప్ప మమ్మల్ని ఎక్కడికీ తీసుకెళ్ల లేదు. వీసా రాలేదని ఇచ్చి డబ్బు కంటే తక్కువ డబ్బుని కొంతమందికి ఇచ్చాడు. మేము గత మూడు నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. అందరం ఫిర్యాదులు ఇచ్చాం. కానీ, మాకు ఎలాంటి స్పందన కనిపించలేదు. పుణ్య క్షేత్రాలకు తీసుకెళ్తానని చెప్పి మా అందరినీ భరత్ కుమార్ మోసం చేశాడు” అని బాధితులు వాపోయారు.
మరో ట్రావెల్ మోసం హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తామంటూ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్.. వందలాది మందిని మోసగించాడు. కోట్ల రూపాయలు వసూలు చేసి కుచ్చు టోపీ పెట్టాడు. కాగా, భరత్ పై గతంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ లోనూ మోసం చేసిన కేసు నమోదైంది. అప్పుడు భరత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన భరత్.. మరోసారి అదే దందా చేశాడు. యాత్రల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డాడు. తమకు న్యాయం చేయాలని, తమ డబ్బు తమకు ఇప్పించాలని, మాయ మాటలతో మోసం చేసిన భరత్ ను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : బీకేర్ ఫుల్.. చుట్టంలా వస్తారు సర్వం దోచుకెళ్తారు.. పోలీసులకు చిక్కిన ఘరానా దొంగల ముఠా..