Snoring operation
Sangareddy: సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆపరేషన్ చేస్తే గురుక తగ్గుతుందని వైద్యులు సూచనలతో వారు అడిగిన సొమ్మును చెల్లించి ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆపరేషన్ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
కొండాపూర్ మండలం గారకుర్తి గ్రామానికి చెందిన వి. శ్రీనివాస్ అనే వ్యక్తి కొంతకాలంగా గురకతో బాధపడుతున్నాడు. రాత్రివేళ పడుకున్న సమయంలో విపరీతంగా గురక వస్తుండటంతో సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. గురక తగ్గించేందుకు మందులు ఇవ్వాలని వైద్యులను కోరగా.. వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. దీనికి కొంత ఖర్చు అవుతుందని చెప్పడంతో శ్రీనివాస్ ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమయ్యాడు.
వైద్యులు బుధవారం రాత్రి శ్రీనివాస్ కు సర్జరీ చేశారు. సర్జరీ చేస్తున్న సమయంలోనే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడి బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకొని తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.