IPS Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు!
IPS Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు ఆయనను భద్రత మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించారు.
IPS Uday Krishna Reddy
- ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్ విధింపు
- 14 రోజుల రిమాండ్ విధించిన జడ్జి
- ఆగష్టు 11 వరకు రిమాండ్ లో ఉదయ్ కృష్ణారెడ్డి
- ఉప్పరపల్లి కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు తరలింపు
IPS Uday Krishna Reddy : తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్ ఆరోపణల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు ఆయనను భద్రత మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాల ప్రకారం కృష్ణారెడ్డి రిమాండ్ ఆగస్టు 11 వరకు కొనసాగనుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (NPA)లో ట్రైనింగ్ సమయంలో కర్ణాటకకు చెందిన తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయ్‌కృష్ణారెడ్డిపై బీఎన్ఎస్లోని పలు సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంపై తొలుత జూలై 15న పోలీస్ అకాడమీలో ఫిర్యాదు చేసిన మహిళా ట్రైనీ అధికారి, జూలై 17న పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఉదయ్‌కృష్ణారెడ్డిని మిర్యాలగూడ సమీపంలో జూలై 28న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు.
Read Also : AP Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. 24 గంటలు అప్రమత్తం.. ఎవరూ బయటకు రావొద్దు.. తీవ్ర హెచ్చరిక!
రిమాండ్‌కు ముందు కోర్టులో వాదనలు :
ఉదయ్‌కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బీఎన్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని వాదించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్, సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. విచారణకు సహకరించేందుకు తన క్లయింట్ సిద్ధంగా ఉన్నారని, రిమాండ్ తిరస్కరించి బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం చివరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టులో క్వాష్ పిటిషన్ :
మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్‌కృష్ణారెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు, కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ప్రస్తుతం ఉదయ్‌కృష్ణారెడ్డి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు.
