Vehicle Showroom
Telangana Govt : తెలంగాణలోని వాహనదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. షో రూమ్‌లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ విధానాన్ని శనివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఆర్టీఏ అధికారులు ప్రయోగాత్మకంగా దీనిని హైదరాబాద్‌లో ప్రారంభించారు.
టూ వీలర్, కారు కొనుగోలు చేసిన వారు రవాణా శాఖ కార్యాలయంకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఈనెల 8వ తేదీన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా రవాణాశాఖ అధికారులు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. శుక్రవారం శ్రీకృష్ణ ఆటోమోటివ్స్ షో రూమ్‌లో ఆ సాప్ట్‌వేర్‌ను పరీక్షించారు. కారు కొన్న ఓ వాహనదారుడికి కొత్త విధానం ద్వారా షోరూమ్ నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేశారు. సాప్ట్‌వేర్ విజయవంతం కావడంతో శనివారం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు.
రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. శనివారం నుండి వాహనాల షో రూంల (డీలర్ల) వద్ద నుండే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. రవాణాశాఖలో నేటి నుంచి మరిన్ని సంస్కరణలు అమలవుతాయని చెప్పారు.
కొత్తగా వాహనం కొనుగోలు చేసిన వాహనదారుడు రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, ఎక్కడ వాహనం కొంటే అక్కడ షో రూమ్‌ల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేయబడుతుందని మంత్రి తెలిపారు. రవాణా శాఖలో అన్నిరకాల సేవలు ఆన్‌లైన్‌లోనే చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, దీని ద్వారా రవాణా సేవలు, సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువకానున్నాయని మంత్రి తెలిపారు.
రవాణా శాఖ ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ, తీసుకొచ్చిందని, రవాణా శాఖ అనేక సంస్కరణలు తీసుకొచ్చి రవాణా సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చిందని, ప్రజలంతా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.