Telangana Cabinet : నేడే తెలంగాణ కేబినెట్.. ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన!
తెలంగాణ కేబినెట్ మంగళవారం (జూలై 13) సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.

Ts Cabinet Key Decisions To Be Taken On Job Requirements
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ మంగళవారం (జూలై 13) సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఉద్యోగాల భర్తీపై చర్చించి… మెగా నోటిఫికేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ భేటీలో 50 వేల ఉద్యోగ నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. తెలంగాణలో యాభైవేల ఉద్యోగాల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయనుంది. ఈ రోజు జరగబోయే కేబినెట్ భేటీలో 50వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. శాఖల వారీగా అధికారులు ఖాళీల వివరాలు సేకరించారు. రాష్ట్రంలోని 32 శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదం అనంతరం రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త జోన్ల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది.
అటు ఏపీతో నెలకొన్న నీళ్ల పంచాయితీపైనా సమగ్రంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది మంత్రి మండలి. అటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, వ్యవసాయ రంగం, కరోనా నియంత్రణ, పల్లె-పట్టణ ప్రగతి, ఉద్యోగాల భర్తీపై ప్రధానంగా మంత్రివర్గం చర్చించనుంది. ఇక తెలంగాణలోనే అక్రమప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోందన్న ఏపీ సీఎం జగన్ చేసిన కామెంట్స్‌పై ఏపీకి తెలంగాణ కేబినెట్ గట్టి కౌంటర్ ఇచ్చేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. కరోనా నియంత్రణ, థర్డ్ వేవ్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై విస్తృతంగా చర్చించనుంది మంత్రివర్గం. ఈ నెల 1న మొదలైన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం 10న ముగిసింది.
ఈ కార్యక్రమంలో చేపట్టిన హరితహారం, పల్లె- పట్టణ పారిశుద్ధ్యంపై చర్చించి రిపోర్ట్ తీసుకోనుంది. ఇటు హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశం కూడా కేబినెట్‌లో చర్చనీయాంశం కానుంది. ఇంతవరకు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న కౌశిక్‌రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు అధికార టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధపడ్డారు. దీంతో హుజూరాబాద్‌లో అభ్యర్థిపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.