BRS-Congress MLAs: బీఆర్ఎస్ లో ఘర్ వాపసీ.. ఇద్దరు ఎమ్మెల్యేలు వెనక్కి..!?
BRS - Congress MLAs: వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రూట్ క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు నేతలు. ఇదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత..బీఆర్ఎస్ను వీడిన పది మంది జంపింగ్ ఎమ్మెల్యేల్లో కొందరు తిరిగి గులాబీ పార్టీ వైపు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
TS Political Buzz Two Congress MLAs May Return to BRS
BRS – Congress MLAs: పొలిటికల్ సిచ్యువేషన్స్, ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఈ నెల 7కి సరిగ్గా రెండున్నరేళ్లు కావొస్తోంది. సగం పాలనాకాలం ముగియడంతో ఇక రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రూట్ క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు నేతలు. ఇదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత..బీఆర్ఎస్ను వీడిన పది మంది జంపింగ్ ఎమ్మెల్యేల్లో కొందరు తిరిగి గులాబీ పార్టీ వైపు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తిరిగి కారు పార్టీకి దగ్గరవగా..మరో ఇద్దరు జంపింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. తమ నియోజకవర్గాల్లో మంత్రులు, స్థానిక కాంగ్రెస్ నేతల జోక్యం పెరగడం, తాము ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభించకపోవడం, అభివృద్ధి కార్యక్రమాల్లో తమకు స్వేచ్ఛ లేకపోవడం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను అసహనానికి గురిచేస్తున్నాయట. అంతేకాకుండా కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తమ రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడ్డట్లు కూడా వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోనే ఉంటే వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో తమ పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వారిని వెంటాడుతోందట. దీంతో పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో టచ్‌లో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
Also Read : పవన్ కళ్యాణ్‌పై సంచలన కామెంట్స్ చేసిన కవిత.. కళాకారులను అవమానిస్తావా?
అయితే గూడెం మహిపాల్‌రెడ్డి ఆయనంతట ఆయనే తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్లు చెప్పుకుంటున్నారు కారు పార్టీ నేతలు. తిరిగి బీఆర్ఎస్లో చేరాలనుకుంటున్న ఇద్దరు జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో కేటీఆర్ తొందర పడట్లేదని చెబుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వారికి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. జంపింగ్ ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తి..వారి నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులను బీఆర్ఎస్ జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు జంపింగ్ ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం..కాంగ్రెస్ పార్టీలోనూ కలకలం రేపుతోంది. ఇప్పటికే ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కాంగ్రెస్ నాయకత్వానికి సవాల్‌గా మారిందనే ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ మరికొందరు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ వైపు వెళ్తే.. తమకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుందని భావిస్తున్నారట హస్తం పార్టీ నేతలు. అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు వాస్తవం ఉందో లేదో అనేది..ఇప్పటివరకు సంబంధిత ఎమ్మెల్యేలు కూడా ఖండించలేదు. ఇందులో ఒకరు ఉత్తర తెలంగాణ సీనియర్ ఎమ్మెల్యే కాగా..మరొకరు దక్షణ తెలంగాణాకు చెందిన బలమైన సామాజికవర్గ ఎమ్మెల్యే కావడం విశేషం. ఈ ఇద్దిరికీ నియోజకవర్గంలోని బలమైన కాంగ్రెస్ నేతలతో వివాదం సమసిపోవడం లేదట. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రచ్చ రగులుతూనే ఉంది.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబీ గూటి వైపు చూస్తున్నారా.? లేక ఇది కేవలం రాజకీయ ఒత్తిడి పెంచేందుకు జరుగుతున్న ప్రచారమేనా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మళ్లీ పార్టీలోకి రావాలనుకుంటున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సేమ్‌టైమ్ కాంగ్రెస్ నాయకత్వం అసంతృప్త ఎమ్మెల్యేలను ఎలా బుజ్జగించబోతోందనేది కూడా రానున్న రోజుల్లో తేలనుంది. అప్పటివరకు తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
