ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. ఇటీవల ప్రగతి భవన్ లో ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.
సంస్థలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను కూడా వెంటనే పర్మినెంట్ చేస్తామన్నారు. కార్మికులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత ఉంటుందని, కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పారు. ప్రతీ డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా ఉండే ఓ సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పదవీ విరమణ పెంచుతూ ఉత్తర్వులు కేసీఆర్ సంతకాలు చేశారు.