12ఏళ్లు దాటిన వాహనాలకు రోడ్ల పైకి నో ఎంట్రీ

12ఏళ్లు దాటిన వాహనాలకు రోడ్ల పైకి నో ఎంట్రీ

Updated On : February 13, 2020 / 3:17 AM IST

వాతావరణ కాలుష్యానికి తీవ్రంగా కారణమవుతోన్న 12ఏళ్లు దాటిన డీజిల్‌ వాహనాలను రోడ్లపైకి రావడానికి వీల్లేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రత్యేకించి హైదరాబాద్‌లో అటువంటి వాహనాలను నియంత్రించేందుకు రవాణాశాఖ త్వరలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఢిల్లీ ఎదుర్కొంటున్న వాయు కాలుష్య సమస్య హైదరాబాద్‌లోనూ మొదలుకాకుండా చూడాలని తొందరగానే మేల్కోవాలని సర్కారు ప్లాన్ చేస్తుంది. 

మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఇదే అంశంపై ప్రస్తావన వచ్చింది. వాహనాల పొగ హైదరాబాద్‌ను ఉక్కిరిబిక్కిరి చేయకముందే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మీదట పనిచేయనున్నారు. వాటికి అనుగుణంగా మొక్కలు పెంచడంతోపాటు డీజిల్‌ వాహనాలను నియంత్రణ చర్యలు తీసుకోనున్నారు. 

గతంలో రవాణాశాఖ చేసిన ప్రపోజల్స్ రివ్యూ, ఎక్స్‌పర్ట్‌లు ఇచ్చిన రిపోర్ట్‌లోని వివరాల ఆధారంగా దృష్టి సారించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి తెలంగాణ మోటారు వాహన చట్టానికి సవరణలు చేయాలని రవాణాశాఖ భావిస్తోంది. కొత్త జరిమానాలను ప్రతిపాదిస్తూ చట్ట సవరణ చేయనున్నట్టు తెలిసింది.

డీజిల్‌ వాహనాల సంఖ్య పెరగకుండా చూడటమే టార్గెట్. హైదరాబాద్‌ రోడ్లపై దాదాపు 15 లక్షల డీజిల్‌ వాహనాలు తిరుగుతున్నాయి. వాటి నుంచి పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. పెట్రోల్‌ వాహనాల కంటే డీజిల్‌ వాహనాలపై 2 శాతం జీవిత పన్ను అదనంగా వసూలు చేస్తున్నారు. 12 ఏళ్లు తిరిగిన డీజిల్‌ వాహనాలను నిషేధించాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం.