Union Minister Narayanaswamy : ముఖ్యమంత్రి కాగానే ప్రధానమంత్రి అవుతానంటే ఎలా? అదో పిచ్చి కల.. కేసీఆర్‌పై కేంద్రమంత్రి సెటైర్లు
సీఎం కాగానే పీఎం అయిపోవాలంటే ఎలా? ప్రధాని కావాలన్న పిచ్చి కలలు వదిలేయాలి. జాతీయ పార్టీ పెట్టే ముందు రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించాలి.

Union Minister Narayanaswamy : తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి నారాయణస్వామి సెటైర్లు వేశారు. ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కంటున్నారని, ఆ పిచ్చి కలలను మానుకోవాలని సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు వెళ్లిన నారాయణ స్వామి.. కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వెనుక మహా అంటే ఐదుగురు ఎంపీలు ఉన్నారని, ఐదుగురు ఎంపీలు ఉన్న కేసీఆర్ ప్రధాని అవుతారా? అని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ కూటమిని ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో కేసీఆర్ వరుసగా భేటీ అవుతున్నారు. బీజేపీ ముక్త్ భారత్ నినాదాన్ని వినిపిస్తున్నారు.
ఈ క్రమంలో కేసీఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నారాయణ స్వామి సెటైరికల్ విమర్శలు గుప్పించారు. సీఎం కాగానే పీఎం అయిపోవాలంటే ఎలా? అంటూ ప్రశ్నించిన నారాయణ స్వామి… ఎంపీ సీట్లన్నీ గెలిచి ప్రధాని కావాలన్న పిచ్చి కలలు వదిలేయాలని సూచించారు. జాతీయ పార్టీ పెట్టే ముందు రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించాలని హితవు పలికారు.
కేసీఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంపై నారాయణ స్వామి ఘాటుగా స్పందించారు. ప్రతి ఒక్కరు ఒక ఇండిపెండెంట్‌తో, ఓ స్టేట్ పార్టీతో ఏడెనిమిది ఎంపీ సీట్లను గెలిచి ప్రధాని అయిపోవాలనుకుంటే సాధ్యపడుతుందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ దిశగా కేసీఆర్ చేస్తున్న ఆలోచనలన్నీ పిచ్చి ఆలోచనలేనని ఆయన అన్నారు. ఒక సీఎంగా ఐదేళ్లలో ఎన్ని సమస్యలు పరిష్కరిస్తానన్న ఆలోచన చేసే వారే నిజమైన నాయకుడని నారాయణ స్వామి అన్నారు.
కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు కేసీఆర్. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే దేశ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారిందని కేసీఆర్ ఆరోపించారు. సమయం వచ్చినప్పుడల్లా బీజేపీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
ఇక త్వరలోనే జాతీయ రాజకీయ పార్టీని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు.