గచ్చిబౌలిలో కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి.. జైల్లో తనను టార్చర్ పెట్టిన ఖైదీని లేపేయాలని..
గదిలో తనిఖీలు చేయగా మరొక తుపాకీ దొరికింది.

Battula Prabhakar
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బులో జరిగిన కాల్పుల ఘటన కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అతడి నుంచి పోలీసులు మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న స్నేహితుడివి రూమ్‌లో ప్రభాకర్ బస చేశాడు. గతంలో వైజాగ్ జైల్లో తనతో పాటు ఉన్న ఓ ఖైదీని చంపేందుకు ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. జైల్లో ఉన్న సమయంలో తనను చిత్రహింసలు పెట్టినందుకు తోటి ఖైదీని చంపేందుకు ప్రభాకర్ కుట్ర పని ఈ తుపాకులు కొన్నాడు.
అతడు బిహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రిజం పబ్బులో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రభాకర్ ప్రయత్నించాడు. ప్రభాకర్‌ను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్, బౌన్సర్లు గాయపడ్డారు. మొదట స్పాట్‌లోనే ప్రభాకర్ నుంచి పోలీసులు రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని ప్రభాకర్ ఉంటున్న గదిలో తనిఖీలు చేయగా మరొక తుపాకి దొరికింది.
కాగా, గత రాత్రి ప్రభాకర్.. పబ్‌లోకి వస్తాడన్న సమాచారంతో కొన్ని రోజులుగా పబ్‌పై పోలీసులు నిఘా పెట్టారు. పోలీసులు అనుకున్నట్లుగానే పబ్‌కి వచ్చాడు ప్రభాకర్. అక్కడ పోలీసులను చూసి వెంటనే రెండు రౌండ్లు కాల్పులు జరిపడంతో కలకలం చెలరేగింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ వెంకటరామిరెడ్డి పాదంలోకి ఓ తూటా దూసుకెళ్లింది.