నవంబర్ 21న బర్త్ డే..సెలబ్రేట్ చేసుకుందామన్నాడు – వీర జవాన్ భార్య

Veera Jawans Mahesh wife : రెండేళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న మహేష్ మరణం.. భార్య సుహాసినిని షాక్‌కి గురి చేసింది.. భర్త లేని జీవితం శూన్యమంటూ శోకించడం చూపరులను కంటతడిపెట్టిస్తోంది. నవంబర్ 21న నా పుట్టిన రోజు … ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుందాం….. నవంబర్ 12 కల్లా ఇంటికి వచ్చేస్తాను… అంటూ చెప్పిన తన భర్త మరుసటి రోజే కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరుడయ్యాడంటూ భోరున విలపిస్తోంది వీర జవాన్ మహేశ్ భార్య సుహాసిని. ఇక్కడ నేను సేఫ్, అక్కడ నువ్వు సేఫ్‌గా ఉండాలంటూ చెప్పిన భర్తకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని కన్నీటి పర్యంతమైంది.
నిజామాబాద్ జిల్లా : –
వీర జవాన్ ర్యాడా మహేష్ నిజామాబాద్ జిల్లా వాసి. వేల్పూర్ మండలం కోమటిపల్లి ఆయన స్వగ్రామం. గంగమల్లు, రాజు ఆయన తల్లిదండ్రులు. వీరిది వ్యవసాయ కుటుంబం. మహేష్ అన్న ఉపాధి కోసం గల్ప్‌కు వెళ్లాడు. మహేశ్ 2014లో ఆర్మీ జవాన్‌గా విధుల్లో చేరారు. చిన్నప్పటి నుంచి దేశభక్తి భావాలు ఉన్న మహేశ్ ఆ ఆసక్తితో ఆర్మీలో చేరారు. ఆరేళ్ల నుంచి దేశసేవలో నిమగ్నమై ఉన్నారు మహేష్.
మంత్రి వేముల పరామర్శ: –
జవాన్ మరణ వార్త తెలియడంతో గ్రామంలో విషాదం నెలకొంది… తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మహేశ్ కుటుంబసభ్యులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరామర్శించారు. వీర మరణం పొందిన జవాన్ కుటుంబానికి ప్రభుత్వం, ప్రజలు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహేశ్‌కు మంత్రి నివాళులర్పించారు.
విషాద ఛాయలు : –
మహేశ్ మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ ఊరు నుంచి ఆర్మీలో చేరిన మహేశ్‌ను చూసి ఆ గ్రామస్థులు ఎప్పుడూ మురిసిపోయే వారు. మహేశ్ చాలా అదృష్టవంతుడు.. దేశానికి సేవ చేసే అవకాశం దక్కిందని అనుకునేవారు. కానీ సరిహద్దు వద్ద ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోతాడని ఎవరూ అనుకోలేదు. మహేశ్.. మరో రెండు మూడు రోజుల్లోనే ఇంటికి వస్తానని చెప్పి.. ఇప్పుడు ఇలా జరగడం బాధాకరమన్నారు కుటుంబసభ్యులు. దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు గర్వంగా ఉన్నా.. తమను వదిలి వెళ్లాడన్న బాధ తీరనిదన్నారు.
https://10tv.in/army-jawan-ryada-mahesh-funeral-is-over-in-nizamabad/
ఏడాది వ్యవధిలో మూడు ఉద్యోగాలు : –
చిన్నప్పటి నుంచి ఎంతో చురుగ్గా ఉండే మహేశ్.. ఏడాది వ్యవధిలో మూడు ఉద్యోగాలు సంపాదించాడని అతని స్నేహితులు చెబుతున్నారు. మహేశ్‌కు ఆర్మీలో పని చేయడం ఇష్టమని.. ఆ ఇష్టంతోనే దేశ సేవ కోసం రక్షణ శాఖలో చేరాడని అంటున్నారు. దేశం కోసం వీర మరణం పొందిన మహేశ్‌ను తలచుకుంటే తమకు గర్వంగా ఉందని చెప్పారు. చదువులో మహేశ్ ఎప్పుడూ ఫస్టే అంటున్నారు అతని చిన్ననాటి స్నేహితుడు. తమ చుట్టుపక్కల ఎవరూ ఆర్మీలో చేయడం లేదని.. కానీ మహేశ్‌కి ఆర్మీలో ఉద్యోగం రావడంతో తామంతా మురిసిపోయామన్నారు.
మహేష్ పట్టుదల : –
మహేశ్ పట్టుదల చాలా మంది యువతకు స్పూర్తిగా నిలిచిందన్నారు. దేశానికి మహేశ్ చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేదని చెప్పారు. మహేశ్ తమతో ఎంతో సరదాగా ఉండేవాడని చెబుతున్నారు స్నేహితులు. త్వరలో తన పుట్టిన రోజుకు ఇంటికి వస్తానని.. అందరం కలిసి వేడుకలు జరుపుకుందామని చెప్పాడని గుర్తు చేసుకున్నారు. కానీ ఇంతలోనే మహేశ్ లేడన్న వార్త విని తట్టుకోలేకపోతున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు.