Vijayashanti : బీజేపీలో కొందరు నేతల తీరుపై విజయశాంతి అసంతృప్తి..! పొలిటికల్ సర్కిల్‌లో చర్చినీయాంశంగా వరుస ట్వీట్లు..

అధ్యక్షులు కిషన్ రెడ్డి నేతృత్వంలో డాక్టర్ లక్ష్మణ్, సంజయ్ సాధించిన ఫలితాల బాటలో బీజేపీ మరెన్నో గణనీయ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.

Vijayashanti

BJP Leader Vijayashanti: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. కేంద్ర, రాష్ట్ర పార్టీ అగ్రనేతలు తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టిసారించారు. గత కొద్ది నెలల క్రితం, కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు తెలంగాణలో అధికారం బీజేపీదే అనేస్థాయిలో ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్లింది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తరువాత తెలంగాణలోనూ పార్టీ ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. దీనికితోడు బీజేపీలోకి వస్తారనుకున్న ఇతర పార్టీల్లోని కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవటంతోపాటు, బీజేపీ రాష్ట్ర పార్టీలో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరడంతో రాష్ట్రంలో పార్టీ ప్రభావం తగ్గుతూ వచ్చింది. దీంతో కేంద్ర పార్టీ అధిష్టానం నష్టనివారణ చర్యలకు దిగింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను తొలగించి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. ఇటీవల కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ తెలంగాణలో బీజేపీని బలోపేతంచేసే దిశగా ముందుకు సాగుతున్నారు.

Kishan Reddy : 10 లక్షల ఉద్యోగ పోస్టులను భర్తీ చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

చర్చనీయాంశంగా విజయశాంతి వరుస ట్వీట్లు ..

తెలంగాణ బీజేపీలో పలువురు నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీలో కొంతమంది తీరుపై విజయశాంతి అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఆమె చేస్తున్న వరుస ట్వీట్లు పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా ఆమె ట్విటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని తెలంగాణలో నెలల తరబడి నష్టపరిచే ధోరణిలో నడిచిన చిట్ చాట్‌ల, న్యూస్ లీక్‌లతో సమస్యలు సృష్టించినట్లు అర్థం చేసుకున్నం. ఎప్పటిలానే ఇప్పుడుకూడా పార్టీ కార్యకర్తల్లా రాష్ట్రం కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నాం. కానీ, రాష్ట్ర పార్టీలో కొంత మంది కుట్రపూర్వకంగా ఫిర్యాదు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ ఫిర్యాదుల విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని బండి సంజయ్ చెప్పారు. బండి సంజయ్ చెప్పింది వాస్తవానికి దగ్గర ఉంది అంటూ విజయశాంతి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Kishan Reddy: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ.. ఎందుకంటే?

బీజేపీ వ్యతిరేకులు, వ్యతిరేక మీడియా ప్రాయోజిత అంశాలను అధిగమించాల్సిన అవసరం ఉంది. అధ్యక్షులు కిషన్ రెడ్డి నేతృత్వంలో డాక్టర్ లక్ష్మణ్, సంజయ్ సాధించిన ఫలితాల బాటలో బీజేపీ మరెన్నో గణనీయ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. గత రెండు రోజుల క్రితం మణిపూర్ అంశంపై వరుస ట్వీట్లు చేసిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో జరుగుతున్న సంఘటనలు యావత్ దేశాన్ని తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయని, సభ్యసమాజం సిగ్గుతో బాధపడుతుందని అన్నారు. నేరస్థులపై కఠినంగా వ్యవహరించాలని, ఉరితీసి శిక్షించబడాలని కోరుకుంటున్నట్లు విజయశాంతి వరుస ట్వీట్ల ద్వారా పేర్కొన్నారు. అయితే, విజయశాంతి పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆ పార్టీ నేతలు కొందరు పేర్కొంటున్నారు. విజయశాంతి చేసిన ట్వీట్లు రాష్ట్రంలో పార్టీ బలోపేతంకోసం ఐక్యంగా ముందుకు సాగుదామనే అర్థంతోనే ఉన్నాయని పేర్కొంటున్నారు.