బీజేపీలోకి మొదలైన వలసలు..కాషాయ కండువా కప్పుకోనున్న విజయశాంతి

  • Publish Date - December 6, 2020 / 01:34 PM IST

Vijayashanti join BJP : గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటడంతో ఆ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. కాషాయ కండువా కప్పుకోవడానికి విజయశాంతి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు నడ్డా సమక్షంలో రాములమ్మ బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారు. ఆమెతో పాటు కాంగ్రెస్ నేత గూడూరు నారాయణ రెడ్డి…కూడా బీజేపీలో చేరతారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌పై చెప్పిన విజయశాంతి రేపటి నుంచి బీజేపీ నేతగా మారనున్నారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు బండి సంజయ్‌, కిషన్ రెడ్డితో కలిసి.. విజయశాంతి అమిత్‌ షాను కలవనున్నారు.



దుబ్బాక, జీహెచ్ఎంసీలో అనూహ్య గెలుపు తర్వాత బీజేపీలోకి వలసలు పెరిగాయి. ఇక గ్రేటర్ ఎన్నికలకు ముందే స్వామి గౌడ్ తోపాటు పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నారని గ్రేటర్ ఎన్నికలకు ముందే ఊహాగానాలొచ్చాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్త నేతలు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. సర్వే సత్యానారాయణ, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వంటి నేతలు రేస్ లో ఉన్నారు.



ఇక ఉత్తమ్ రాజీనామాతో రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ దక్కనుందనే వార్తలతో ఆ పార్టీలోని కొందరు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ ను చేసిన మరుక్షణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునే సూచనలు కనిస్తున్నాయి.

తెలంగాణలో అధికార పార్టీని గట్టిగా ఢీకొడుతున్న బీజేపీ…ఇతర పార్టీల్లో ఉన్న కీలక నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.