CM Revanth Reddy: మోదీని సీఎం రేవంత్ వెనకేసుకొస్తున్నారా? సాఫ్ట్‌కార్నర్ వెనక ఆంతర్యమేంటి ?
ఏమైనా హాట్‌హాట్‌గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మరో ఆసక్తికర అంశం చేరినట్లు అయింది.

సీఎం రేవంత్ నోట.. ప్రధాని మోదీ మాట! తెలంగాణ రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేసింది. ఆయన మంచివారే.. సమస్య అంతా ఈయనతోనే అంటూ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని విమర్శించే ప్రాసెస్‌లో.. మోదీని వెనకేసుకొచ్చినట్లుగా రేవంత్ మాట్లాడిన మాటలు.. ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్ అవుతున్నాయ్.
ఢిల్లీలో మోదీని కలిసి వచ్చిన తర్వాత.. రేవంత్ వైఖరిలో మార్పు కనిపిస్తుందన్న గుసగుసలు.. తెలంగాణ పాలిటిక్స్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయ్. దీంతో కాంగ్రెస్‌లోనూ చర్చ మొదలైందట. కారణం ఏంటా అని ఆరా తీస్తున్నారట.
ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్ చాలామందిని. ప్రతీ మాట వెనక ఓ వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం ఎప్పుడూ మాట రూపంలోనే మొదలవుతుంటుంది. రాజకీయాల్లో ఇదంతా కామన్ కూడా ! అలాంటి మాటే ఒకటి.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. ఈ మధ్యే ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వైఖరిలో.. స్పష్టమైన మార్పు కనిపిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
మోదీనే ఢిల్లీకి పిలిపించుకున్నారా?
సీఎం రేవంత్ అడగ్గానే ఏమీ ఆలోచించకుండా మోదీ అప్పాయింట్‌మెంట్ ఇచ్చారనే చర్చ ఓ వైపు జరుగుతుంటే.. రేవంత్ రెడ్డికి కబురుపెట్టి మరీ మోదీనే ఢిల్లీ పిలిపించుకున్నారనే గుసగుసలు మరోవైపు వినిపిస్తున్నాయ్. ఇక తెలంగాణకు సంబంధించి రావాల్సిన అంశాలు, కావాల్సిన అంశాలపై.. మోదీకి రేవంత్ వినతిపత్రం ఇచ్చారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ ఇద్దరి భేటీ జరిగింది. ఐతే మోదీ, రేవంత్.. ఓ పది నిమిషాలు ఏకాంతంగా మాట్లాడుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీ టూర్‌లో మోదీని కలిసి వచ్చిన తర్వాత.. రేవంత్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందనే చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. వనపర్తి సభలో సీఎం మాట్లాడిన తీరే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ చెప్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని విమర్శించే ప్రాసెస్‌లో.. ప్రధాని మోదీని వెనకేసుకొచ్చారు రేవంత్.
మోదీ మంచిగానే ఉన్నారని.. తెలంగాణపై సానుభూతితో ఏదైనా మంచి చేయాలని అనుకుంటున్నారన్న రేవంత్.. కిషన్ రెడ్డే ఓర్వలేక అడ్డుపడుతున్నారంటు విమర్శించారు. తెలంగాణకు కిషన్ రెడ్డి సైంధవుడిగా మారారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమస్య మోదీ కాదు.. కిషన్ రెడ్డితో అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయ్.
కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ..
తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ.. కేబినెట్‌లోని మంత్రులు సహా.. ప్రతిపక్షాలన్నీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయ్. కేంద్ర బడ్జెట్‌లోనూ ఏపీకి వరాలు గుప్పించి.. తెలంగాణకు మొండిచేయి చూపించారనే విమర్శలు వినిపించాయ్. విభజన సమస్యలతో పాటు తెలంగాణ నుంచి ఏం అడిగినా సరే.. మోదీ పట్టించుకోవడం లేదని అధికారపక్షంతో పాటు విపక్షం కూడా విరుచుకుపడుతోంది.
ఐతే సీఎం రేవంత్ మాత్రం.. ప్రధాని మోదీని వెనకేసుకు రావడం.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తోందట. తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలైతే.. ఏంటీ వైపరిత్యం అంటూ ఆశ్చర్యపోతున్నారని గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సర్కార్‌ను, రేవంత్‌ను బీజేపీ కాపాడుతోందని.. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తున్న వేళ.. ప్రధాని మోదీని రేవంత్ వెనకేసుకు రావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
ప్రధాని మోదీపై ఉన్నట్లుండి రేవంత్ ప్రసంశలు గుప్పించడం వెనక మతలబేంటో అంతుపట్టడం లేదని కాంగ్రెస్ నేతలు చర్చించుకున్నారట. హఠాత్తుగా సీఎం రేవంత్‌లో మార్పు ఎందుకొచ్చింది.. మోదీని ఎందుకు వెనకేసుకొస్తున్నారనే ఆలోచనల్లో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్లు.. ప్రధాని మోదీపై సాఫ్ట్ కార్నర్ వెనక అంతరంగం ఏమై ఉంటుందన్నది.. రేవంత్‌కు మాత్రమే తెలుసని మరికొందరు పార్టీ నేతలు నిట్టూరుస్తున్న పరిస్థితి. ఏమైనా హాట్‌హాట్‌గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మరో ఆసక్తికర అంశం చేరినట్లు అయింది.